
విజయవాడ : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఒక్క శాతం కూడా పరిష్కరించకుండా ఇప్పుడు చేపడుతోన్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం పండగ ఎలా అవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ ఎన్ రఘవీరా రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం..జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై రఘవీరారెడ్డి స్పందిస్తూ..ఈ కార్యక్రమంలోనైనా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో మడకశిర, కల్యాణదుర్గం, పెనుగొండ నియోజకవర్గంలో వందలాది గ్రామాలలో పర్యటించినపుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన్నట్లు గుర్తు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 61 వేల మంది, కల్యాణదుర్గం నియోజకవర్గంలో 49 వేల మంది, పెనుగొండలో 45 వేల మంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చారన్నారు. ఈ అర్జీలను స్థానిక రెవెన్యూ అధికారికి, కలెక్టర్‌కు తానే స్వయంగా అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో పింఛన్‌లు నిలిపేశారని, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.