స్వలాభం కోసం ఏపీలో ప్రత్యేక ప్యాకేజీలు
⇒ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజం
అనంతపురం : రాష్ట్రంలోని టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు లబ్ధి చేకూర్చడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీలు కోరుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయన్నారు. పరిశ్రమలొస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదాను పక్కన పెట్టి స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీలు కోరడం బాధాకరమన్నారు.
‘ప్రాజెక్టు అనంత’ను ‘ఎన్‌టీఆర్ ఆశయం’గా మార్చేశారు!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ అయ్యప్పన్ నేతృత్యంలో అనంతపురం అభివృద్ధి కోసం రూపొందించిన ‘ప్రాజెక్టు అనంత’ను కాపీ కొడుతూ ‘ఎన్‌టీఆర్ ఆశయం’ పేరుతో రూ. 6,500 కోట్ల ప్యాకేజీని సీఎం ప్రకటించారని తెలిపారు. అయితే.. ప్రాజెక్టు అనంతలో రూపొందించిన అంశాలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఆర్థికశాఖ ఆమోదం కూడా పొందిన ప్రాజెక్టు అనంతను యథావిధిగా అమలు చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి కోసం సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన అంశాలే అమలుకాలేదని, ఈ ప్యాకేజీనైనా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఏ రాజకీయ పార్టీకీ ఆహ్వానం లేకుండా టీడీపీ కార్యక్రమంలా నిర్వహించడం బాధాకరమన్నారు.