తిరగబడ్డ జనం ...
► గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు
► ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?
► జన్మభూమిలో అధికారులను అడ్డుకున్న ప్రజలు
మూడో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం రసాభాసగా సాగింది. పలు చోట్ల అధికారులపై జనం తిరగబడ్డారు. ‘‘గతంలో ఇచ్చిన అర్జీలకే దిక్కులేదు..ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వచ్చారు’’ అంటూ నిలదీశారు. పలుచోట్ల అధికార పార్టీ నేతలకూ చుక్కెదురైంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మా ఊరు గ్రామ సభల్లో అధికారులను జనం నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో అధికార పార్టీనేతలకే చుక్కెదురైంది. పలమనేరులో టీడీపీ నేతలకు సూచించిన వారికే రేషన్ కార్డులు ఇస్తున్నారంటూ మహిళలు అధికారులను నిలదీశారు.
పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్యనే ఘర్షణ చోటుచేసుకుంది. నగరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జన్మభూమి కమిటీ సభ్యుడే అధికారులను నిలదీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాసారంలో శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ గురవయ్యనాయుడును స్థానికులను అడ్డుకున్నారు. పట్టణంలోని రెండో వార్డులో టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ పేటరాధారెడ్డిపై స్థానికులు తిరగబడ్డారు.
పలమనేరు నియోజకవర్గం వికోట మండలంలోని క్రిష్ణాపురంలో రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఎన్.అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలోని ఒకటో వార్డులో వేదికపై జన్మభూమి కమిటీ సభ్యులను కూర్చొపెట్టడంతో వివాదం జరిగింది. ఈవిషయంపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. టీడీపీ కార్యకర్తలు చెప్పినవారికే రేషన్‌కార్డులు ఇచ్చారంటూ మహిళలు అధికారులను అడ్డుకున్నారు.
సత్యవేడు నియోజకవర్గం టీపీ కోటలో అధికారులను జనం అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు రేషన్‌కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. పుంగనూరు మున్సిపాలిటీ 24వ వార్డులో వైస్‌చైర్మన్ అమరేంద్ర, కౌన్సిలర్ ఇబ్రహీం, పింఛన్లు, రుణాలు మంజూరు కాలేదని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఖలీల్‌తో వాగ్వాదానికి దిగారు. కమిషనర్ కేఎల్‌వర్మ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.తిరుపతి పెద్దకాపువీధిలో జన్మభూమి వేదికపై ఉన్న ఎమ్మెల్యే సుగుణమ్మ, మున్సిపల్ అధికారులకు స్థానిక మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు.
చిత్తూరు మండలంలో కుర్చివేడులో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా 3 గంటల పాటు జనం అడ్డుకున్నారు. చివరకు సర్పంచ్ జోక్యంతో శాంతించారు. తంబళ్ళపల్లె నియోజకవర్గం కురబలకోట తెట్టు గ్రామంలో అంత్యోదయకార్డులు రద్దుచేశారని అధికారులపై జనం తిరగబడ్డారు. ఆర్‌ఎన్ తాండాలో రుణమాఫీ, పంట నష్టపరిహారం, మరుగుదొడ్ల బిల్లుల కోసం అధికారులను నిలదీశారు. నగరి నియోజకవర్గం విజయపురం మండల కేంద్రంలో అధికార పార్టీ కార్యకర్తలకు ఫించన్లు మంజూరు చేయడంపై వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతి ఎంపీడీవో దశరధరామయ్యను నిలదీశారు.
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని సొన్నేగానిపల్లె, ఎంకే పురంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో స్థానిక టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుడుపల్లె మండలం బెగ్గిలిపల్లెలో నిర్వహించిన సభలో టీడీపీకి చెందిన వూజీ ఎంపీటీసీ సభ్యుడు రామకృష్ణ సవువేశంలో అధికారులను నిలదీశారు. ‘‘ఇప్పటికి రెండు జన్మభూముల్లో అర్జీలు ఇచ్చాం.. ఎక్కడ పరిష్కారం చూపారో నిరూపించండి’’ అని ప్రశ్నించారు. కేవీపల్లె మండలం జిల్లేళ్ల మందలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు గుండ్లూరు జయరామచంద్రయ్య చేతి నుంచి టీడీపీ నాయకులు మైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాగవాండ్లపల్లెలో నిర్వహిం చిన సభలో జిల్లా కలెక్టర్ సిదార్థజైన్ పాల్గొన్నారు. గతంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో అర్జీలు ఇచ్చినా ఇంతవరకు మంజూరు కాలేదని ప్రజలు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు.
మొదటి రోజు 219 ప్రాంతాల్లో జన్మభూమి
చిత్తూరు (గిరింపేట): జిల్లాలోని 219 ప్రాంతాల్లో శనివారం ప్రారంభమైన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించామని జిల్లా కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న 189 గ్రామ పంచాయతీలు, 30 వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజలకు పలు రకాల సంక్షేమ పథకాలు అందజేసి వారి సమస్యలను వినతిపత్రాల రూపంలో స్వీకరిస్తామని తెలిపారు.