
మహానంది: అన్నదమ్ముల ఇళ్ల మధ్య ఉన్న స్థల వివాదం ఓ నిండు ప్రాణాన్ని తీసుకుంది. మసీదుపురం గ్రామానికి చెందిన నరాల ప్రభావతి(35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మహానంది ఎస్‌ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపిన వివరాల మేరకు.. నరాల ప్రభావతి, మాధవీశ్వరరెడ్డి, రాజేశ్వరరెడ్డి, సువర్ణ దంపతుల ఇంటి మధ్య స్థల వివాదం ఉంది. దీంతో గత కొద్దిరోజులుగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో గొడవలు జరిగాయి.
అన్నదమ్ముల మధ్య స్థల సమస్య ఉండటంతో రెండు రోజుల నుంచి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రాజేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు దూషిస్తూ కొట్టినారని మనస్తాపం చెందిన ప్రభావతి పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నంద్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పరిస్థితి విషమించడంతో కోలుకోలేక మృతి చెందింది. ప్రభావతి తండ్రి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు రాజేశ్వరరెడ్డి దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.