మదనాపురం మార్కెట్ యార్డు కార్యాలయం
సాక్షి, మదనాపురం: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ సాగుతోంది. వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదివికి అధికార పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా 1946 అక్టోబర్ 1న ఇక్కడ మార్కెట్‌యార్డ్ ఏర్పడింది. మొదట్లో తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ యార్డుకు ఓ ప్రత్యేతక ఉంది.
ఏడు నెలల కిందట ముగిసిన పదవీకాలం
చెర్మెన్ పదవీకాలం 2018 ఆగస్టు 8న ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ కావడంతో చాలామంది ఆశావహులు మార్కెట్ కమిటీ చెర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నారు. కొత్తకోట మండలం నుంచి ముగ్గురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. స్వంత మండలానికే ఇవ్వాలనీ మదనాపురం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి సూచించినట్లు ఓ సీనియర్ కార్యకర్త తెలిపారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో చాలా మంది ఆశావాహులు పోటిలో ఉన్నారు. మదనాపురం నుంచి ఐదుగురు పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు.
ఏడాదికి రూ.కోటి ఆదాయం
ప్రతి ఏటా మార్కెట్ కమిటీ ద్వార ప్రభుత్వానికి కోటి రుపాయాల ఆదాయం వస్తోంది. వరిధాన్యం కొనుగోలు, కందులు, పల్లీల ద్వార ఈ ఆదాయం వస్తుంది. మదనాపురం, కొత్తకోట, అడ్డాకల్, మూసాపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి వస్తారు. రూ. 9 కోట్ల నాబార్డు నిధులతో కొత్తకోటలో 5వేల మెట్రికల్ టన్నుల బియ్యం నిల్వ చేసే గోదాం, మదనాపురంలో 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాం నిర్మించారు.
305 ఎకరాల భూమి
జిల్లాలో ఎక్కడ లేని విధంగా మదనాపురం, దంతనూరు, తిర్మాలయపల్లి శివార్లను కలుపుతూ మార్కెట్‌కు 305 ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించారు. అయితే 50 ఎకరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి, బీసీల నివాసా లకు 14 ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 ఎకరాలు, పశువైద్యం కేంద్రం ఒక్క ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్ ఎకరన్నర, జిల్లా పరిషత్ పాఠశాల రెండు ఎకరాలు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకూ మార్కెట్ స్థలం కేటాయించారు. మొత్తంగా ఆదాయం, ఆస్తులు కలిగిన ఈ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాకే తేలే పరిస్థితి కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment