మహబూబ్‌నగర్ క్రైం : ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కలెక్టరేట్‌లో వాహనం పెడితే భద్రంగా ఉంటుందని భావించి తన బైక్‌ను కలెక్టరేట్‌లో పెట్టి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రాంతంలో బైక్ లేదు. చివరకు అంతట గాలించిన దొరకలేదు చివరకు ఎవరో అపహరించారని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒక్కటే కాదు పట్టణంలో బైక్ దొంగతనాల దగ్గర నుంచి ఇళ్ల చోరీల వరకు ప్రతి ఒక్కటి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల అడ్డుకట్టకు చర్యలు కరవవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. వాటి సాయంతో నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు తత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదైన సందర్భాలున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం నెలకొంది.
జిల్లా కేంద్రంలో ఆకతాయిలు ఆగడాలు సృష్టిస్తూ పోలీసులకు చిక్కకుండాపోతున్నారు. మహిళలపై జరిగే ఎన్నో వేధింపులు వెలుగులోకి రాకుండా పొతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు నిఘా కెమెరాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ప్రతి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సైతం సూచిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అవి అందుబాటులో రావడం లేదు. జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిని, దొంగతనాలకు పాల్పడిన వారి గుర్తించి సొమ్ములను రికవరీ చేసిన కొన్ని సందర్భాలున్నాయి.
కెమెరాల ఏర్పాటులో జాప్యం
జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి ఎదుట, అవంతి హోటల్ సమీపంలో, న్యూటౌన్ పంచవటి హోటల్ నుంచి సుభాష్ చంద్రభోస్ విగ్రహాం వరకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ఎదుట, బస్టాండ్‌లో, కలెక్టరెట్‌లో, అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ చౌరస్తాలో, పాత బస్టాండ్‌లో, క్లాక్‌టవర్, ఆకుల చౌరస్తా, వన్‌టౌన్ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బండమీదిపల్లి శివారు, కోయిలకొండ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
వితరణ కోసం వెంపర్లాట
జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. భద్రతా చర్యల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యంగా పోలీసులు భావిస్తున్నా వితరణ కోసం వెంపర్లాడుతున్నారు. పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ముందుకొస్తే వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపిక చేసిన ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నామంటున్నారు. పోలీసుల సూచనల మేరకు వ్యాపారుల ఎవరికి వారు దుకాణాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం లేకుండాపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment