surveilance
-
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
‘టిక్‌టాక్’పై భారత్ నిఘానే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : అనతికాలంలోనే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్ మీడియా ‘టిక్‌టాక్’ ప్రపంచ దేశాలకన్నా భారత్ అధికారుల నిఘానే ఎక్కువగా కొనసాగుతోంది. వినియోగదారుల సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రపంచంలో 28 దేశాలు ‘టిక్‌టాక్’ యాజమాన్యాన్ని కోరగా, అందులో 36 శాతం విజ్ఞప్తులు ఒక్క భారత అధికారుల నుంచే వచ్చాయి. వాటిల్లో 107 చట్టపరమైన, అత్యవసర విజ్ఞుప్తులు ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. టిక్‌టాక్ యూజర్లలో 40 శాతం మంది భారతీయులే అవడం వల్ల కూడా ఎక్కువ విజ్ఞప్తులు భారత్ నుంచే రావచ్చని కూడా వ్యాఖ్యానించింది. గత జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీల మధ్య 28 దేశాల నుంచి తమకు యూజర్ల సమాచారం కావాలంటూ విజ్ఞప్తులు వచ్చాయని ఇటీవల విడుదల చేసిన ఓ అధికార నివేదికలో ‘టిక్‌టాక్’ యాజమాన్యం వెల్లడించింది. ఇలా వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి వచ్చే విజ్ఞప్తులను తాము తీవ్రంగానే పరిగణిస్తామని, యూజర్ కామెంట్లు వివిధ దేశాల స్థానిక చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయా?, దేశాల విజ్ఞప్తులు న్యాయ ప్రక్రియకు లోబడే ఉన్నాయా ? అన్న అంశాలను ఒకటికి, రెండు సార్లు పరిశీలిస్తామని యాజమాన్యం తెలిపింది. భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో సగానికన్నా తక్కువ కేసుల్లోనే వినియోగదారుల సమాచారాన్ని అందించినట్లు చైనాకు చెందిన స్వల్ప కాలిక వీడియోలను అప్లోడ్ చేసే ‘టిక్‌టాక్’ యాజ్మాన్యం తెలిపింది. టిక్‌టాక్ కూడా పెడదోరణలనుబట్టే సమాచారాన్ని ప్రోత్సహిస్తోందని, పిల్లల ప్రైవసీకి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలానా సమాచారం స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉందంటూ, దాన్ని వెంటనే తొలగించాలంటూ కూడా ప్రభుత్వ అధికార విభాగాల నుంచి తమకు విజ్ఞప్తులు వస్తుంటాయని, గతేడాది అలాగా 11 విజ్ఞప్తులు రాగా, వాటిలో ఎనిమిది అకౌంట్లను పూర్తిగా మూసివేశామని, మిగతా మూడింటిలో ‘విషయాన్ని’ తొలగించామని యాజమాన్యం తెలిపింది. -
ప్రశాంత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
సాక్షి, విజయనగరం టౌన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ ఆర్పి.ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ ఎఆర్.దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీస్ శాఖ చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు, వాహన తనిఖీలు గురించి ఎస్పీ దామోదర్ రాష్ట్ర డీజీపీ ఆర్.పి.ఠాగూర్‌కు వివరించారు. విశాఖ రేంజ్ డీఐజీ పాలరాజు విశాఖ రేంజ్ పరిధిలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను డీజీపీకీ వివరించారు. రాష్ట్ర డీజీపీ ఆర్పి.ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ ఒకేసారి చేపడుతున్నందున పోలీస్ ఫోర్సును చక్కని ప్రణాళికతో వినియోగించాలని ఆదేశించారు. పారా మిలిటరీ దళాలను ప్రతీ జిల్లాకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ పారా మిలిటరీ దళాల సహకారంతో స్ధానిక వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని, గ్రామ సందర్శనలో కూడా వీరి సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే ప్రత్యేక ఫ్లైయింగ్ స్క్వాడ్లు, స్టేటిక్ సర్విలైన్స్ బృందాలు, అంతర్రాష్ట్ర, అంతర జిల్లా చెక్‌పోస్టులు వద్ద తనిఖీలను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. వాహన తనిఖీలను చేపట్టే సమయంలో అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని, సీజ్ చేసిన నగదు, మద్యం, గుట్కాలు, ఎన్నికల సామగ్రి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో విశాఖ రేంజ్ డీఐజీ పాలరాజు, ఎస్పీ ఎఆర్.దామోదర్, అదనపు ఎస్పీ ఎమ్.నరసింహారావు, ఓఎస్డీ జె.రామ్మోహనరావు, ఎస్బీ డీఎస్పీ సిఎమ్.నాయుడు, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎమ్.శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు, ఎస్బీ సీఐ జి.రామకృష్ణ, బి సెక్షన్ సూపరింటెండెంట్ గోపీనాథ్, కమ్యూనికేషన్ సీఐ రమణమూర్తి ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచాలి
సాక్షి, కర్నూలు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై బ్యాంకు అధికారులు నిఘా ఉంచాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సోమవారం ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షకు మించి నగదు జమ చేసినా, విత్‌డ్రా చేసినా వారి వివరాలను జిల్లా ఎలక్షన్ సెల్‌కు, సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఎవరైనా ఆన్లైన్లో నగదును ఇతరుల ఖాతాల్లోకి పెద్దపెద్ద మొత్తాల్లో బదిలీ చేసినా.. అలాంటి వారి వివరాలను సైతం తెలియజేయాలన్నారు. ఏటీఎంలు, బ్యాంకు బ్రాంచులకు నగదును రవాణా చేసే వాహనాల్లో సంబంధిత పత్రాలు కలిగి ఉండాలన్నారు. సెక్యూరిటీ వాహనాల్లో డబ్బులను తరలించే బ్యాంకు సిబ్బందికి విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. బ్యాంకు తుపాకులకు సంబంధించి మినహాయింపు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌తో అనుమతి తీసుకోవాలని సూచించారు. బ్యాంకుల భద్రత కోసం ఉన్న తుపాకులకు లైసెన్సులు రెన్యూవల్ చేయించుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నగేష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామచంద్ర, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
నిఘాపై నీలినీడలు!
మహబూబ్‌నగర్ క్రైం : ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు కలెక్టరేట్లో వాహనం పెడితే భద్రంగా ఉంటుందని భావించి తన బైక్‌ను కలెక్టరేట్లో పెట్టి డ్యూటీకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి పార్క్ చేసిన ప్రాంతంలో బైక్ లేదు. చివరకు అంతట గాలించిన దొరకలేదు చివరకు ఎవరో అపహరించారని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒక్కటే కాదు పట్టణంలో బైక్ దొంగతనాల దగ్గర నుంచి ఇళ్ల చోరీల వరకు ప్రతి ఒక్కటి దోచుకొని దర్జాగా వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల అడ్డుకట్టకు చర్యలు కరవవుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. వాటి సాయంతో నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు తత్సారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నేరాల సంఖ్య ఎక్కువగా నమోదైన సందర్భాలున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ యంత్రాంగం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఆకతాయిలు ఆగడాలు సృష్టిస్తూ పోలీసులకు చిక్కకుండాపోతున్నారు. మహిళలపై జరిగే ఎన్నో వేధింపులు వెలుగులోకి రాకుండా పొతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. వీటన్నింటిని అరికట్టేందుకు నిఘా కెమెరాలు(సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. ప్రతి జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు సైతం సూచిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం అవి అందుబాటులో రావడం లేదు. జిల్లా కేంద్రంలో కొన్ని దుకాణాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిని, దొంగతనాలకు పాల్పడిన వారి గుర్తించి సొమ్ములను రికవరీ చేసిన కొన్ని సందర్భాలున్నాయి. కెమెరాల ఏర్పాటులో జాప్యం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి ఎదుట, అవంతి హోటల్ సమీపంలో, న్యూటౌన్ పంచవటి హోటల్ నుంచి సుభాష్ చంద్రభోస్ విగ్రహాం వరకు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బాలికల జూనియర్ కళాశాల ఎదుట, బస్టాండ్‌లో, కలెక్టరెట్లో, అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ చౌరస్తాలో, పాత బస్టాండ్‌లో, క్లాక్‌టవర్, ఆకుల చౌరస్తా, వన్‌టౌన్ ప్రాంతాల్లో ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బండమీదిపల్లి శివారు, కోయిలకొండ ఎక్స్‌రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సైతం తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వితరణ కోసం వెంపర్లాట జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. భద్రతా చర్యల నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యంగా పోలీసులు భావిస్తున్నా వితరణ కోసం వెంపర్లాడుతున్నారు. పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు ముందుకొస్తే వాటిని ఏర్పాటు చేయడానికి అవకాశాలుంటాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపిక చేసిన ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నామంటున్నారు. పోలీసుల సూచనల మేరకు వ్యాపారుల ఎవరికి వారు దుకాణాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇతర అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం లేకుండాపోతుంది. -
పెరిగిన నిఘా..
విజయవాడ(గుణదల): పద్మావతి ఘాట్‌లో సోమవారం పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఘాట్‌లో చోటుచేసుకుంటున్న నేరాలను నిర్మూలించటానికి పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అక్టోపస్, సీఆర్పీఎఫ్ విభాగాలు రంగంలోకి దిగాయి. ఘాట్ల వద్ద పహార కాస్తున్నారు. పిండ ప్రధానం, స్నానాలు ఆచరించే ప్రాంతంలో కలియ తిరుగుతూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలకు చెక్.. నదిలో స్నానమాచరిస్తున్న మహిళలు, యువతుల వెంటపడుతున్న, స్నానమాచరిస్తున్న సమయం లో వారితోపాటు నదిలో దిగి వేధిస్తున్న పలువురు యువకులను ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పుణ్యస్నానాలకు వస్తున్న వారిని మోసం చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. నకిలీ గుర్తింపుకార్డు దారులు గుర్తింపు .. స్నానఘాట్ల వద్ద కొంత మంది నకిలీ గుర్తింపు కార్డులు వేసుకుని భక్తులను మోసం చేసి వారివద్ద నగలు, నగదు అపహరించుకుపోతున్న వారిపై పోలీసులు నిఘాను పెంచారు. సోమవారం పలువురు పోలీసులు మఫ్టీలో తిరుగుతూ గుర్తింపు కార్డులు లేని అర్చకులను అక్కడి నుంచి పంపేశారు. గుర్తింపుకార్డుల్లో అధికారుల సంతకం లేకుండా, కలర్ జిరాక్స్ కాపీలతో గుర్తింపు కార్డులను రూపొందించుకుని వచ్చే వారిపై నిఘా పెంచారు. ఘాట్లలో విధులు నిర్వరిస్తున్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పోలీసులు, పోలీసు వాలంటీర్లు తనిఖీ చేసి అధికారుల సంతకం లేని వారిని విచారిస్తున్నారు. మాయమాటలు నమ్మోద్దు.. ఘాట్‌లో మోసకారులు, దొంగలు తిరుగుతున్నారని, ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా, దొంగతనానికి పాల్పడినా వెంటనే తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఘాట్‌లో విధులు నిర్వర్తించే వివిధ విభాగాల ప్రతినిధులు తప్పని సరిగా గుర్తింపు కార్డుపై అధికారి సంతకం ఉండాలని, అలా లేకుంటే కేసు నమెదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.