మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం
అమ్మతనం కమ్మదనం పొందడానికి ఆ తల్లీ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. కాన్పు పునర్జన్మతో సమానం అని తెలిసినా అందుకు సిద్ధపడుతుంది. బిడ్డను చేతికివ్వగానే ఆమె మేను పులకురిస్తుంది. కానీ ఆ అమ్మకు ‘కడుపుకోత’లతో అనేక వ్యాధుల పలకరిస్తున్నాయి. వైద్యో నారయణ హరీ! అంటారు, కానీ ప్రైవేటు వైద్యుల పట్టనితత్వమో, పైసల వ్యామోహమో సహజ కాన్పుకు నోచుకోలేక అమ్మకు ఈ దుస్థితి వచ్చింది.
సాక్షి, పాలమూరు: అనవసర శస్త్రచికిత్సలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాంటి వాటిని మూసివేయడానికి కూడా వెనుకాడం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసే సాధారణ ప్రసవాలు, సిజేరియన్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ నమోదు చేయాలని ఇటీవల సమీక్షలో కలెక్టర్ ప్రైవేట్ వైద్యులకు చెప్పిన మాటలివి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నవమాసాలు బిడ్డను ఆనందంతో మోసినా ప్రసవ సమయంలో కడుపుకోత మిగుల్చుతున్నారు. పురుడు అంటేనే పునర్జన్మ అంటారు. అలాంటిది కాన్పు అంటేనే కోతగా మారింది. శస్త్రచికిత్స కాన్పులతో చిన్నారులకు జన్మనిస్తున్న తల్లులు బిడ్డలను చూసుకొని తాత్కాలికంగా మురిసిపోతున్నారు.
అనంతరం వారు వివిధ రకాల రుగ్మతలకు గురవుతున్నారు. కొంతమేర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సాధారణ కాన్పులు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం దాదాపు 80 శాతానికిపైగా సిజేరియన్లే జరుగుతున్నాయి. పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడంతో వారు సాధారణ ప్రసవం చేయడానికి సాహసించడం లేదు. దీంతో గర్భిణులకు సాంకేతిక కారణాలు చెప్పి మాయ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు, సిజేరియన్లు చేస్తూ దండిగా డబ్బులు దండుకుంటున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు అయ్యాయి. ఇందులో సాధారణ 307, సిజేరియన్లు 640 కాగా.. ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది పుట్టారు.
అవసరం లేకున్నా..
విదేశాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో తప్ప ప్రసవం సిజేరియన్ ద్వారా చేయరు. స్థానికంగా మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలో సిజేరియన్ కాన్పులతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అవసరం ఉ న్నా.. లేకపోయినా శస్త్రచికిత్స నిర్వహిస్తుండటంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలకైతే మరీ నరకం. ఆస్తులు తనఖా పెట్టుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ లో మాత్రమే అధికంగా సిజేరియన్ కాన్పులు నిర్వ హిస్తున్నారు. ఒక్కో కాన్పునకు కనీసంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా జిల్లాలో ప్రైవేట్‌లో అయిన 648 ప్రసవాలకు ఒక్క కేసుకు రూ.30 వేలు లెక్కించినా రూ.1.94 కోట్ల సొత్తు ప్రైవేట్ ఆస్పత్రులు వెనకేసుకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారికి ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా వారే రూ.12 వేలు చెల్లించడంతోపాటు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లోనే..
వైద్య వర్గాల సమాచారం మేరకు నాలుగు సందర్భాల్లోనే సిజేరియన్‌కు వెళ్లాల్సి వస్తోంది. సుఖ ప్రసవానికి కడుపులో బిడ్డ ఉన్న విధానం ప్రతికూలంగా ఉన్నప్పుడు.. బిడ్డ బయటకు రావడానికి మాయ, కణతులు అడ్డుగా ఉండటం వంటి బలమైన కారణాలు ఉంటేనే సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణాలు లేకపోయినా గర్భిణులు, వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేసి కోతలకు వెళ్తున్నారు. అవగాహన లేని ప్రజలు వైద్యులు సూచనల మేరకు సిజేరియన్లకు మొగ్గు చూపుతున్నారు.
కోతలతో దీర్ఘకాలిక నష్టాలు
కడుపు కోత కారణంగా శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
- మునుపటిలా శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తుంటాయి.
- హెర్నియా వంటి దీర్ఘకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.
- రెండోకాన్పు తప్పకుండా సిజేరియన్ చేయాల్సి వస్తుంది.
- సిజేరియన్ జరిగే సమయంలో గర్భాశయం పక్కన భాగాలపై గాయాలవడంతోపాటు ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి.
- మత్తు మందుతో ఒక్కోసారి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
- రక్తస్రావంతో అదనపు రక్తాన్ని అందించాల్సిన పరిస్థితులు వస్తాయి. ూ రెండో కాన్పు సమయంలో తొమ్మిదో నెలలో గర్భసంచికి గతంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంది.
- గర్భసంచికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. తద్వారా భవిష్యత్‌లో అప్పుడప్పుడు తీవ్ర కడుపునొప్పి సమస్యలు ఎదురవుతాయి.
- కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు.
చర్యలు తీసుకుంటాం
గతంతో పోలిస్తే ప్రస్తుతం సిజేరియన్లు తగ్గాయి. వాటిని మరింత తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలు మెరుగయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చ ర్యలు తీసుకుంటాం. బాధితులు ఎవరైనా మాకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులకు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి నార్మల్ ప్రసవాలపై నిబంధనలు వివరిస్తాం.
– డాక్టర్ రజిని, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిణి, మహబూబ్‌నగర్
సాధారణ కాన్పుతో ఆరోగ్యం
సాధారణ కాన్పుతో మహిళకు ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవవు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా శస్త్రచికిత్స ప్రసవం చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ కాన్పు అయ్యాక కొన్ని దుష్పరిణామాలు భవిష్యత్‌లో ఏర్పడవచ్చు. సిజేరియన్‌తో శరీర సహజత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో శరీరం అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సహకరించదు. కనీసం ఇంట్లో పనులు చేసుకోవడంలోనూ నొప్పులు వేధిస్తాయి. లీటరు రక్తం వరకు వృథాగా వెళ్తుంది.
– రాధ, గైనిక్ హెచ్‌ఓడీ జనరల్ ఆస్పత్రి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment