ఉపర్‌పల్లిలోలో వాటర్ బాటిళ్లతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు
సాక్షి, మక్తల్: వేసవికాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్లు కరువయ్యాయి. ప్రతి రోజు పాఠశాలల్లో విద్యార్థులు మంచినీళ్లు లభించక దాహార్తితో అలమటిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంటలు చేయడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాలల్లో మంచినీటి ఎద్దడి నెలకొన్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. మక్తల్ మండలంలో మొత్తం 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 36 పీఎస్‌లు, 14 యూపీఎస్‌లు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో మొత్తం దాదాపు 27 పాఠశాలల్లో మంచినీటి సమస్య ఏర్పడి విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కనీసం పాఠశాల విద్యార్థులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితి దాపురించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు అక్కడ తాగడానికి కూడా మంచినీళ్లు లేకపోవడం మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేసిన విద్యార్థులకు కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు కరువైపోయాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులు ప్రతి రోజు ఆయా పాఠశాలల్లో మంచినీళ్ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణనాతీతం. కొందరు విద్యార్థులు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకొని తోటి విద్యార్థులతో కలిసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని పంచదేవ్‌పహాడ్, పస్పుల, జక్లేర్, బొందల్‌కుంట, మక్తల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కర్ని, రామసముద్రం, జౌలపురం, ఉపర్‌పల్లి, సోమేశ్వర్‌బండ తదితర పాఠశాలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా పాఠశాలల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment