
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొడంగల్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారి రసవత్తరంగా మారాయి. ఇప్పటికే సవాళ్లు, ప్రతిసవాళ్లు, మాటల తూటాలతో రక్తి కడుతున్న రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శల తూటాలు పేలుస్తున్న రేవంత్ లక్ష్యంగా గులాబీ పార్టీ అనేక వ్యూహాలను అమలు చేసింది. రేవంత్‌కు మద్దతుగా నిలిచిన నేతలందరినీ గులాబీ కండువా కప్పుకునేలా చేయడంలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న రేవంత్.. కొడంగల్ రాజకీయ చిత్రంలో భీష్ముడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కుటుంబంపై దృష్టి సారించారు. గురునాథ్‌రెడ్డి అన్న కూతురు అనురెడ్డి అలియాస్ అనిత స్వయంగా రేవంత్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. దీంతో కథ అడ్డం తిరుగుతోందని భావించిన టీఆర్‌ఎస్ నష్టనివారణ చర్యలు చేపట్టగా.. స్వయం గా గురునాథ్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్‌ఎస్‌ను వీడేది లేదని ప్రకటించడం గమనార్హం.
ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉమ్మడి పాలమూరుపై దృష్టి సారించింది. జిల్లాలో సంస్థాగతం గా బలంగా ఉన్న కాంగ్రెస్‌లో రేవంత్ చేరడం ద్వారా ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించి రేవంత్ ను స్వంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పార్టీ బలహీ నం చేసేలా ఆయన అనుచరులు, పార్టీ ముఖ్యులందరినీ టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. అలాగే, నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రూ.కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. అలాగే వారం లో మూడు రోజుల పాటు వివిధ శాఖలకు చెందిన మం త్రులు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో నియోజకవర్గంలో రేవంత్ పట్టును తగ్గించి, తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది.
సహనం కోల్పోయిన రేవంత్..
నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ చేపట్టిన ‘ఆపరేషన్’తో రేవంత్ సహనం కోల్పోయినట్లు రాజకీయవర్గాలు పే ర్కొంటున్నాయి. తన నుంచి వెళ్లిపోయిన నేతలు, మం త్రి లక్ష్మారెడ్డిపై దూషణల పర్వం కొనసాగించారు. అంతేకాదు మంత్రి లక్ష్మారెడ్డి నియోజకవర్గమైన జడ్చర్లలో విస్తృతంగా పర్యటించారు. అయితే, లక్ష్మారెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. ఏకంగా కొడంగల్ నియోజకవర్గంలో కురువృద్ధుడిగా పేరొందిన గురునాథ్‌రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి చీలిక తీసుకొచ్చారు. గురునాథ్‌రెడ్డి అన్న కూ తురు స్వయంగా రేవంత్‌ను కలిసి మద్దతు ప్రకటించ డం ఇందులో భాగమేనని చెబుతున్నారు. అంతేకాదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్‌రెడ్డి.. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వెనక చేతులు కట్టుకుని తిరుగుతున్నారంటూ ప్రచారానికి తెరలేపారు. తద్వారా గురున్నాథరెడ్డి అభిమానులను తనవైపుకు తిప్పుకునే చర్యలు చేపట్టారు.
దిద్దుబాటు చర్యలు చేపట్టిన టీఆర్‌ఎస్..
కథ అడ్డం తిరుగుతుండటంతో టీఆర్‌ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు గురునాథ్‌రెడ్డి నేరుగా టీఆర్‌ఎస్‌ను వీడేది లేదని బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. గడిచిన ఎన్నికల్లో నామినేషన్ వేసే చివరి రెండు రోజుల వరకు టికెట్ కోసం వేచిచూసిన తనను మోసం చేసిన కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదన్నారు. అలాగే, మీడియా ముందుకు వచ్చిన అనిత తనకు కూతురు వరుస అవుతుందని తెలిపారు. 50ఏళ్ల క్రితం కుటుంబాలు విడిపోగా ఇప్పుడు తన కూతురునని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం తగదన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్‌గాంధీ పార్టీలో చేర్చుకోవడం.. ఆ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. త న కుమారుడు ముద్దప్ప దేశ్‌ముఖ్ సర్పంచ్‌గా, ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించారని, రాజకీయ భవిష్యత్ ఉన్న ఆయనకు టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాన ని తెలిపారు. అయితే నరేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తారని ప్ర చారం జరుగుతుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, నాయకులు జయతీర్థాచారి, మొగులప్ప, రుద్రారం రాఘవేందర్, పార్వత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment