సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల కోసం ఆబ్కారీ శాఖ ‘మంద’స్తు ప్రణాళిక వేసింది. ఎన్నికల సమయంలో మద్యం కోటాపై ఈసీ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో అధికారులే ముందస్తు నిల్వలకు వెసులుబాటు కల్పిస్తున్నారు. జనవరిలోనే డిపోల నుంచి ‘ప్రణాళికబద్ధంగా’ సరుకు కొనుగోలు చేసుకోవాలని మద్యం దుకాణం/అమ్మకందారులకు విజ్ఞప్తి చేశారు. మద్యం అమ్మకాల జోరు పెంచాలని తెలంగాణ రాష్ట్ర పానీయాల సంస్థ (టీఎస్‌బీసీఎల్) రాష్ట్రంలోని 17 ఐఎఫ్‌ఎంఎల్ డిపోలకు ఆదేశాలు జారీ చేయగా, మేనేజర్లు 2,216 మద్యంషాపులు, 700కుపైగా ఉన్న 2డి బార్ల యజమానులకు లేఖలు రాస్తున్నారు.
ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో...
ఎన్నికల వేళ మద్యం, డబ్బు పంపిణీ సాధా రణంగా మారింది. నోటిఫికేషన్ మొదలు ఫలితాల వరకు మద్యం కోటాపై 2012 నుంచి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తోంది. ఎన్నికలు జరిగే నెలలో డిపోల నుంచి సరుకును కొనుగోలు చేసే మద్యం వ్యాపారులు ఏడాది క్రితం అదే నెలలో ఎంత సరకు లిఫ్ట్ చేశారో అంతమేరకే తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు వచ్చే నెల (2018 ఫిబ్రవరి)లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే, నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అంతకు ముందు ఏడాది అదే నెల (2017 ఫిబ్రవరి)లో ఏయే తేదీల్లో ఎంత మేర సరుకు తీసుకున్నారో, అంతే మద్యం కొనాల్సి ఉంటుంది. ఎన్నికల సమ యం కదా అని ఎక్కువ మద్యాన్ని లిఫ్ట్ చేద్దామంటే కుదరదు. ఎన్నికల సంఘానికి ఈ మేరకు లెక్కలు అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక సంస్థలు, ఉపఎన్నికల వేళగాని అనేక జిల్లా ల్లోని మద్యం దుకాణాల్లో కొరత ఏర్పడింది. ఈసారి ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది.
దుకాణదారులకే లేఖలు
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పానీ యాల సంస్థ (టీఎస్‌బీసీఎల్) వ్యాపారులకు నేరుగా లేఖలు రాస్తోంది. ‘‘ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం మద్యంపై ఆంక్షలు విధించనున్న దృష్ట్యా ముందుగానే కావలసిన సరుకును తీసుకొని నిల్వ చేసుకోవాల్సిందిగా’’ డిపో మేనేజర్లు లేఖలు రాశారు. ఈ మేరకు మంచిర్యాల డిపో మేనేజర్ రవిశంకర్ ఈ నెల 19న రాసిన లేఖ ‘సాక్షి’కి లభించింది. దీనిపై టీఎస్‌బీసీఎల్‌లో విచారించగా, అన్ని డిపోలకు మద్యం సరుకుకు సంబంధించి లేఖ లు రాసిన విషయాన్ని ధ్రువీకరించారు.
నెలలో రూ.1,300 కోట్ల అమ్మకాలు
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరాసరిగా నెల కు రూ.1,300 కోట్ల మేరకు సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.16,000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే కోటాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి అదనపు కోటాను కూడా జనవరి లోగా వ్యాపారులకు అంటగట్టాలని సర్కారు భావిస్తోంది. ఎన్నికల సమయంలో 30 శాతానికిపైగా ఆదాయాన్ని ఆర్జించాలనేది ఆబ్కారీ శాఖ వ్యూహం.
ఆబ్కారీ ‘మంద’స్తు జాగ్రత్త!
Published Sun, Jan 21 2018 3:25 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment