పటాన్‌చెరు టౌన్ : నకిలీ ఇళ్ల పత్రాలను సృష్టించిన 11 మందిలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్న సంఘటన అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. శుక్రవారం స్థానిక పటాన్‌చెరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సీతారాం, అమీన్‌పూర్ సీఐ రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అమీన్‌పూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్సీ తెలిపిన వివరాల మేరకు అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ నకిలీ డాక్యుమెంట్లు వ్యవహారం బయటపడిందని, దీనికి సంబంధించిన ఇద్దరు బిల్డర్లు,రిటైర్డ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి, మధ్యవర్తులు, బిల్ కలెక్టర్, ఇందులో ముఖ్య పాత్ర పోషించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ అధికారి ఫిర్యాదు మేరకు నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో బిల్డర్‌గా పనిచేసే దామోదర్, రిటైర్డ్ పంచాయితీ సెక్రెటరీ తిరుమలయ్య, మీడియేటర్లు ఏడుకొండలు, మహేష్, సురేందర్ రెడ్డి, బిల్డర్ లక్ష్మీనారాయణ, కారోబార్ కుంతి నర్సింలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో నలుగురు టీఆర్‌ఎస్ అమీన్‌పూర్ ఎంపీటీసీ అనిల్ కుమార్, బిల్డర్ శ్రీనివాస్, మీడియేటర్ లింగారావు, అమీన్‌పూర్ పంచాయతీ మాజీ సెక్రెటరీ సోమనారాయణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలతో పాటు, నకిలీ స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని కూడా త్వరలోనే ఆదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సుమారు 29 ఇళ్లు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment