ఆ రెండు చిత్రాల తర్వాత చెప్పుకోదగ్గవి రాలేదు!
‘‘దక్షిణాదిన అగ్ర హీరోలందరి సరసన నటించేశాను. బోల్డన్ని కమర్షియల్ కేరక్టర్స్ చేశాను. కెరీర్ మొదట్లో ‘నేనీ పాత్ర చేయను. నా కోసం అలాంటి పాత్రలు రాయండి’ అని చెప్పే అవకాశం దాదాపు ఎవరికీ ఉండదు. అందుకే, ఇప్పటివరకు ఏది వస్తే అది చేశాను. వాటిలో మనసుకి నచ్చినవి కూడా ఉన్నాయనుకోండి. అయితే ఇక నుంచి మాత్రం పాత్రల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలనుకుంటున్నా’’ అని హీరోయిన్ తమన్నా చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. వీటిలో ‘బాహుబలి’ చిత్రం కూడా ఉంది.
ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేశానని, తనది చాలా మంచి పాత్ర అని తమన్నా చెబుతూ -‘‘నిజానికి ‘100% లవ్’, ‘ఊసరవెల్లి’ తర్వాత నాకు చెప్పుకోదగ్గ పాత్రలేవీ రాలేదు. వచ్చిన వాటిలో కొంచెం ఫర్వాలేదనిపించినవి చేశాను. ‘బాహుబలి’లోది మంచి పాత్ర. నాకు ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్’ లాంటి చిత్రం కానీ, లేడీ ఓరియంటెడ్ మూవీ కానీ చేయాలని ఉంది. ఆ తరహా చిత్రాలకు అవకాశం వస్తే, వెంటనే ఒప్పుకుంటా. కథానాయికగా నేనో వంద సినిమాలు చేశాననుకోండి, భవిష్యత్తులో చెప్పుకోడానికి పది, ఇరవై అయినా ఉండాలిగా. ఇప్పుడది దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంపిక చేసుకుంటున్నా’’ అన్నారు.