
నేను కాదు..అక్షయ్‌కుమారే ‘2.0’ హీరో - రజనీకాంత్
చిట్టి రోబోగా రజనీకాంత్ మళ్లీ వచ్చేశారు. చిట్టితో యుద్ధం ప్రకటిస్తూ క్రౌమ్యాన్‌గా అక్షయ్‌కుమార్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
చిట్టి రోబోగా రజనీకాంత్ మళ్లీ వచ్చేశారు. చిట్టితో యుద్ధం ప్రకటిస్తూ క్రౌమ్యాన్‌గా అక్షయ్‌కుమార్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రజనీ హీరోగా, అక్షయ్ విలన్‌గా నటిస్తున్న సినిమా ‘2.0’. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరి ఫస్ట్ లుక్స్‌ను ఆదివారం ముంబైలో విడుదల చేశారు. 2017 దీపావళికి త్రీడీలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ఈ వేడుకకి వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్, హీరోయిన్ అమీ జాక్సన్‌లతో పాటు చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొన్నారు.
శంకర్‌తో కష్టం : రజనీకాంత్
నాకు ఛాన్స్ ఇస్తే, అక్షయ్ పాత్ర చేసేవాణ్ణి. ఈ సినిమాలో హీరో నేను కాదు.. అతనే. రేపు దేశమంతా అక్షయ్ నటనను ప్రశంసిస్తుంది. నిజం చెప్పాలంటే.. శంకర్‌తో పనిచేయడం కష్టమండీ (నవ్వులు). పర్‌ఫెక్షన్ కోసం పరితపిస్తాడు. సల్మాన్‌ఖాన్ ‘యస్’ అంటే అతనితో కలసి సినిమా చేయడానికి నేను రెడీ.
సూపర్‌స్టార్ గురించి ఏం చెప్పను! : సల్మాన్‌ఖాన్
సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ - ‘‘సూపర్‌స్టార్ (రజనీకాంత్) గురించి ఏం చెప్పను! నన్నెవరూ పిలవకపోయినా ఆయన్ను చూడ్డానికే ఈ వేడుకకి వచ్చా. అక్షయ్ మాత్రమే క్రౌమ్యాన్ పాత్ర చేయగలడు. నటుడిగా విభిన్న పాత్రలు చేస్తూ పైకి ఎదుగుతున్న హిందీ నటుడు అక్షయ్ ఒక్కడే’’ అన్నారు. అది మాత్రమే కాదు.. శంకర్ తరహాలో నువ్వెందుకు సినిమాలు తీయడంలేదని కరణ్ జోహార్‌ను సరదాగా అడిగారు.
రోబో-3 తీస్తా : దర్శకుడు శంకర్
‘రోబో’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ ‘2.0’కి, మొదటి భాగం కంటే పదిరెట్లు ఎక్కువ కష్టపడ్డానని చెప్పిన శంకర్, ‘రోబో-3’ తీస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఈ కథను నమ్మా. ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది’’ అని అక్షయ్‌కుమార్ అన్నారు.