31 రోజులు... 25 సినిమాలు... | 31 days 25 movies january is a movie month | Sakshi
Sakshi News home page

31 రోజులు... 25 సినిమాలు...

Published Tue, Jan 5 2016 11:36 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

31 రోజులు... 25 సినిమాలు... - Sakshi

31 రోజులు... 25 సినిమాలు...

నెలంతా పండగే

కొత్త ఏడాదిలో... కొత్త రిలీజ్‌ల సందడి మిన్నంటుతోంది. ఈ ఒక్క జనవరిలో ఏకంగా 25 సినిమాలు రిలీజవుతున్నాయి. బాబాయ్, అబ్బాయ్ సహా పెద్ద హీరోలు ముగ్గురు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. పల్లెటూరి కథలు, పెళ్ళి కథలు, యాక్షన్ డ్రామాలు, రియల్ లైఫ్ స్టోరీలు - ఇలా ఎటు చూసినా వైవిధ్యమైన కథలతో ఈ నెలంతా రిలీజ్‌ల పండుగ అనిపిస్తోంది. కాస్త అటూ ఇటుగా రూ. 200 నుంచి 300 కోట్ల  మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ పణంగా ఒడ్డుతోంది.

 కొత్త ఏడాది మొదలైంది. మళ్ళీ కొత్త సినిమాల సందడీ మొద లైంది. ఈసారి కొత్త రిలీజుల తాకిడి ఎలా ఉందంటే, మునుపెన్నడూ లేనంతగా ఒకే రోజున నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. కొత్త ఏడాది తొలి రోజునే ఏకంగా మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు (రామ్ ‘నేను... శైలజ’, నాగశౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’, హార్రర్‌కామెడీ ‘చిత్రం భళారే విచిత్రం’) రిలీజయ్యాయి. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ ప్లాన్ చేశాయి.
 
  కానీ, ఆఖరు నిమిషంలో అనివార్య కారణాల వల్ల ఆగాయి. అందులో ఒకటి ‘కిల్లింగ్ వీరప్పన్’ రేపు గురువారం నాడు రిలీజవుతోంది. ఇక, ఆ మరునాడే 8వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘బొంబి బెల్లె’, యానిమేషన్ చిత్రం ‘ఛోటా బీమ్’ సహా ఏకంగా 8 చిత్రాలు రిలీజవడానికి పోటీపడుతున్నాయి. ఆఖరి నిమిషంలో కొన్ని ఆగినా, అందులో సగమైనా కనీసం హాళ్ళలో పలకరించే సూచనలున్నాయి.
 
 సంక్రాంతి పుంజులు... బాబాయ్, అబ్బాయ్
 వెరసి, పదిహేను రోజుల ముందే తెలుగు సినిమాకు సంక్రాంతి వచ్చేసినట్లుంది. ఈసారి సంక్రాంతికి ఊళ్ళలోనే కాదు... సినిమాహాళ్ళ లోనూ స్టార్ కోడిపుంజుల మధ్య పోటాపోటీగా జరగనుంది. ‘నాన్నకు ప్రేమతో...’ అంటూ చిన్న ఎన్టీయార్ ఈసారి సంక్రాంతి సినిమా సందడికి జనవరి 13న తెర తీస్తున్నారు. అబ్బాయ్ అలా అంటుంటే, బాబాయ్ బాలకృష్ణ ఆ మరునాడే భోగి పండుగకి (ఈసారి జనవరి 14న వచ్చింది) ‘డిక్టేటర్’గా వస్తున్నాడు.
 
 నందమూరి వంశం నుంచి ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్‌లో ఇలా పోటీపడడం అభిమాను లతో పాటు సినీ పరిశ్రమలో అందరి మధ్య చర్చనీయాంశమైంది. రెండూ భారీ చిత్రాలే కావడంతో హాళ్ళలో పోరాటమూ భారీగానే మారనుంది. ఇక, జనవరి 14నే యువ హీరో శర్వానంద్ - మేర్లపాక గాంధీల కాంబినేషన్‌లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘మనం’ తరువాత బుల్లితెరపైనే తప్ప, వెండితెరపై కనిపించని నాగార్జున ఎట్టకేలకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనిపించుకుంటూ, ఈ సంక్రాంతికి జనవరి 15న వస్తున్నారు. తమిళనాట యువ హీరోగా పేరు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు విశాల్ కొత్త తమిళ చిత్రం ‘కథకళి’. తమిళులకు కూడా సంక్రాంతి (పొంగల్) పెద్ద పండుగ కావడంతో, అక్కడ ఆ చిత్రం జనవరి 14న రిలీజ్ కానుంది. ‘కథకళి’ పేరుతోనే తయారవుతున్న తెలుగు డబ్బింగ్ కూడా లెక్క ప్రకారమైతే, ఏకకాలంలో తెలుగునాటా రిలీజ్ కావాలి. ఇప్పటికే థియేటర్ల కోసం సినిమాల మధ్య తొక్కిసలాట పరిస్థితి ఉండడంతో ‘కథకళి’ ఒక్కవారం ఆలస్యంగా జనవరి 21న రానుందని పరిశ్రమ వర్గాల కథనం.
 
 మూకుమ్మడిగా మీడియవ్‌ు రేంజ్ చిత్రాలు
 సంక్రాంతి పండుగ అయిపోయినా, హాళ్ళలో పండుగ వాతావరణం తగ్గేలా లేదు. ప్రేక్షకుల మాటెలా ఉన్నా, సంక్రాంతి మరుసటి వారం కూడా కొత్త సినిమాలతో హాళ్ళు ఫుల్‌గా ఉండడం ఖాయం. నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న ‘కళ్యాణ వైభోగమే’ను జనవరి 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
 
  ఇక, మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా ఆయన తండ్రి - సీనియర్ నటుడు సాయికుమార్ స్వయంగా నిర్మించిన ‘గరం’, మరో చిన్న సినిమా కూడా 22న రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక, జనవరిలో ఆఖరి శుక్రవారమైన 29న రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’, కన్నడ అనువాద చిత్రం ‘బొంబాయి మిఠాయి’, సిద్ధార్థ - త్రిష - హన్సిక తదితరులు నటించిన తమిళ ‘అరణ్మణై-2’కు అనువాదం ‘చంద్రకళ-2’, మరో చిన్న చిత్రం ‘నిలువవే వాలు కనుల దానా...’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాయి.
 
 సగటున ప్రతివారం 5 రిలీజ్‌లు
 లెక్కచూస్తే, అయిదు శుక్రవారాలున్న ఈ జనవరి నెలలో ఏకంగా పాతిక సినిమాల దాకా రిలీజవుతున్నాయి. అంటే, సగటున ప్రతి వారం అయిదేసి సినిమాలన్నమాట! ఫిబ్రవరి, మార్చిల్లో కూడా చాలా సినిమాలు సిద్ధమవు తున్నాయి. సునీల్ హీరోగా వస్తున్న ‘కృష్ణాష్టమి’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడు న్నోడు’, త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ’ లాంటివి ఆ జాబితాలో ఉన్నాయి.
 
  ఇన్ని రిలీజ్‌లు చూసి, తీసిన సినిమాలు తీసినట్లు రిలీజైపోతున్నాయను కుంటే పొరపాటే. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని, సరైన రిలీజ్ డేట్ కోసం, తగినన్ని థియేటర్ల కోసం ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమా ఎన్ని వారాలు ఆడుతుందన్న మాట దేవుడెరుగు, అసలు ఏ వారం రిలీజ్ చేయగలుగుతామో తెలియని పరిస్థితి ఇప్పుడు దర్శక, నిర్మాతల్లో నెలకొంది. ‘‘ప్రతివారం ఇన్నేసి సినిమాలు రిలీజవుతుంటే హాళ్ళూ ఖాళీ ఉండట్లేదు. ప్రేక్షకులకూ ఊపిరి పీల్చుకొనే గ్యాప్ రావడం లేదు.
 
  ఈ గందర గోళం మధ్యలో ఎప్పుడు మా సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుందో తెలియడం లేదు’’ అని దాదాపు నెలన్నర క్రితమే అన్ని పనులూ పూర్తి చేసుకొని, రిలీజ్‌కు సిద్ధమైన ఒక యువ హీరో సినిమా తాలూకు నిర్మాత ఆంతరంగికంగా వాపోయారు. దాంతో, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ - ఎగ్జిబిషన్ సెక్టార్ల మిత్రులు, మీడియా శ్రేయోభిలాషులు ఎవరు కనిపించినా దర్శక, నిర్మాతలు ‘సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అంటారూ’ అని అడుగు తున్నారంటే అతిశయోక్తి కాదు.
 
 డిజిటల్ చిత్రనిర్మాణ విధానం వచ్చాక ఔత్సాహికులు ఎక్కువై, చిత్రనిర్మాణం గణనీయంగా పెరిగింది. దాంతో, రిలీజ్‌ల దగ్గర అవస్థలూ పెరిగాయి. నిర్మాణం పూర్తయినా, రిలీజ్‌కు నోచుకోని సినిమాలు పదులకొద్దీ పెరిగాయి. అయినా సరే, గత 2015లో ఏకంగా 172 స్ట్రెయిట్ చిత్రాలూ, 73 డబ్బింగ్‌లూ కలిపి మొత్తం 245 సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరిం చాయి. అంటే, ప్రతివారం 4 నుంచి 5 కొత్త రిలీజులు వచ్చాయన్న మాట!
 
 సీజన్లు మారిపోయాయోచ్...
 ఇన్ని సినిమాల నిర్మాణం, రిలీజ్‌లతో ఇప్పుడు సినిమాల సీజన్ కూడా మారిపోయింది. ఒకప్పుడు సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి లాంటి కొన్నే వరుస రిలీజ్‌లకు సీజన్లు. కానీ, ఇప్పుడు ఆ రూల్స్ మారిపోయాయి. క్రిస్మస్, జనవరి ఫస్ట్ మొదలు ఒకప్పుడు పరీక్షల వల్ల సినిమా కలెక్షన్లకు బ్యాడ్ సీజన్లు అనుకున్న ఫిబ్రవరి, మార్చిల్లో కూడా ఎక్కిడి తొక్కిడిగా సినిమాలు హాళ్ళకు క్యూలు కడుతున్నాయి. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న హాళ్ళు 1800 చిల్లరే. ఫలితంగా, సినిమా బాగుంటే సరే... లేదంటే ఈ శుక్ర వారం రిలీ జయ్యే కొత్త సినిమా కోసం గత శుక్రవారం రిలీజైన సిని మాలు హాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తోంది. దాంతో, కోట్ల కొద్దీ వ్యాపారం కొన్ని వారాలకే హారతి కర్పూ రమవుతోంది.
 
 ఎవరికి మోదం... ఎవరికి ఖేదం...
 కానీ, నాలుగు సెలవులుంటే చాలు... ప్రతి ఒక్కరూ దాన్ని తమ సినిమా రిలీజ్‌తో వసూళ్ళకు ఎడ్వాంటేజ్‌గా మార్చుకోవాలని చూస్తున్నారు. ఎవరూ ఎవరినీ ఆపే, ఆగే పరిస్థితి లేదు. పెద్ద హీరోల, భారీ సినిమాలన్నీ ఒకేసారి రావడంతో చిన్నవాటికి హాళ్ళూ అంతంతే. ఇగోలు వదిలి, కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొనే వాతావరణం లేకపోయేసరికి ఒకరి సినిమాను మరొకరు కిల్ చేస్తున్నారనిపిస్తోంది.

 ‘‘‘ఒకప్పుడు సంక్రాంతి పండుగ సీజన్ అంటే పంట చేతికొచ్చి, రైతుల చేతుల్లో డబ్బులు ఆడతాయి. సినిమాలు ఆడేందుకు మంచి సీజన్ అనుకొనే వాళ్ళం. కానీ, ఇప్పుడు సినిమాల లైఫ్ పదిరోజులకే పరిమితమవడంతో లెక్కలు మారాయి. ఏ పది రోజుల్లో మూడు, నాలుగు సెలవులంటే అప్పుడు రిలీజ్ చేసేస్తున్నాం. దాంతో, చిన్నా, పెద్దా అన్ని సినిమాలూ ఆ సెలవులు కలిసొచ్చేలా ఒకేసారి రిలీజవుతున్నాయి. అందుకే ఈ హడావిడి.’’
                                            - కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత - తెలుగు ఫిల్మ్‌చాంబర్ గౌరవ కార్యదర్శి


 
 ఈ పరిస్థితుల్లో చిత్ర నిర్మాణ, పంపిణీ, ప్రద ర్శన రంగాలకు ప్రాతినిధ్యం వహించే ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ కొత్త రిలీజ్‌లను క్రమబద్ధీకరించి, అన్ని సినిమాలకూ హాళ్ళు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తోంది. రెండు నెలల క్రితం కొందరు నిర్మాతలు, డిస్ట్రి బ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఒక ప్రత్యేక కమిటీ వేసింది. ‘‘ఇవాళ చిత్రనిర్మాణం కన్నా రిలీజ్ ఎక్కువ టెన్షన్‌గా మారింది. అందుకే, అందరినీ చైతన్యం చేసి, ఎవరికీ నష్టం కలగకుండా చేయా లని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం’’ అని నిర్మాత -ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చెప్పారు. ఈ ఒక్క జనవరిలో సుమారు 200 కోట్ల పైగా పణంగా ఒడ్డుతున్న తెలుగు పరిశ్రమలో అలాంటి ప్రయత్నాలు సఫలమైతే ఎంత బాగుండు!  
                                  
  చిత్రం: నాన్నకు ప్రేమతో,
తారాగణం: చిన్న ఎన్టీయార్, రకుల్‌ప్రీత్ సింగ్,
నిర్మాత: భోగవల్లి ప్రసాద్,
దర్శకత్వం: సుకుమార్,
ఇతివృత్తం: రివెంజ్ ఫార్ములా ఫ్యామిలీ డ్రామా,
రిలీజ్: జనవరి 13

చిత్రం: డిక్టేటర్,
తారాగణం: బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్
 నిర్మాతలు: ఈరోస్ ఇంటర్నేషనల్, దర్శకత్వం: శ్రీవాస్
 ఇతివృత్తం: యాక్షన్ డ్రామా, రిలీజ్ డేట్: జనవరి 14
చిత్రం: సోగ్గాడే చిన్ని నాయనా, తారాగణం: నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ,
 నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కల్యాణ్‌కృష్ణ కురసాల, ఇతివృత్తం: ఆత్మ చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామా, రిలీజ్: జనవరి 15
 చిత్రం: సీతమ్మ అందాలురామయ్య సిత్రాలు,
తారా గణం: రాజ్‌తరుణ్, అర్తన,
నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు,కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి,
దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి,
ఇతివృత్తం: యూత్ ఎంటర్ టైనర్,
రిలీజ్: జనవరి 29

చిత్రం: ఎక్స్ ప్రెస్ రాజా, తారాగణం: శర్వానంద్, సురభి,
నిర్మాతలు: వంశీ, ప్రమోద్,
దర్శకత్వం: మేర్ల పాక గాంధీ
 ఇతివృత్తం: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్,
రిలీజ్: జనవరి 14


 చిత్రం: కళ్యాణ వైభోగమే,
తారాగణం: నాగశౌర్య, మాళవికా నాయర్,
నిర్మాత: దామోదర్ ప్రసాద్,
దర్శకత్వం: నందినీరెడ్డి
 ఇతివృత్తం: యూత్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్,
రిలీజ్: జనవరి 22

 చిత్రం: గరం,
తారాగణం: ఆది, ఆదాశర్మ,
నిర్మాత: పి.సురేఖ, దర్శకత్వం: మదన్,
ఇతివృత్తం: యాక్షన్ డ్రామా,
రిలీజ్: జనవరి 22కి ప్లాన్


 చిత్రం: కథకళి,
తారాగణం: విశాల్, కేథరిన్ థెరిస్సా, రెజీనా,
దర్శకత్వం: పాండ్యరాజ్,
 ఇతివృత్తం: యాక్షన్ డ్రామా,
రిలీజ్ డేట్: జనవరి 21

 
 చిత్రం: కిల్లింగ్ వీరప్పన్,
తారాగణం: సందీప్ భరద్వాజ్, శివరాజ్‌కుమార్,
దర్శకత్వం: రావ్‌ుగోపాల్‌వర్మ,
ఇతివృత్తం: వీరప్పన్ రియల్ లైఫ్ స్టోరీ,
రిలీజ్ డేట్: జనవరి 7
 

                                                                                             - రెంటాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement