మరో రెండు వారాలు.. అదే జోరు..
ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం మామూలైపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడటం, దాదాపు అన్నీ మంచి కలెక్షన్లు సాధించటంతో, చాలామంది దర్శక నిర్మాతలు పోటీకే రెడీ అవుతున్నారు. ఎక్కువసార్లు వాయిదా వేయటం కన్నా బరిలో దిగి తేల్చుకోవటమే కరెక్ట్ అని భావిస్తున్నారు. అదే బాటలో మరో రెండువారాల పాటు తెలుగు వెండితెర మీద చిన్న సినిమాల జాతర కనిపించనుంది.
ఈ వారం రెండు స్ట్రయిట్ సినిమాలతో పాటు మరో రెండు అనువాద చిత్రాలు వెండితెర మీద సందడి చేశాయి. అయితే ఈ సినిమాల రిజల్ట్ ఏంటో ఇంకా తేలకముందే వచ్చేవారం మరో మూడు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా స్పీడున్నోడుతో పాటు, చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్, తమిళ్లో ఘనవిజయం సాధించిన కథాకళి చిత్రాలు ఫిబ్రవరి 5న రిలీజ్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 12న కూడా ఇదే స్థాయిలో పోటీ పడుతున్నారు చిన్న చిత్రాల నిర్మాతలు. భలే భలే మగాడివోయ్తో భారీ హిట్ కొట్టిన నాని కృష్ణగాడి వీర ప్రేమగాథతో రెడీ అవుతుంటే. సాయికుమార్ తనయుడు తొలిసారిగా సొంత నిర్మాణసంస్థలో తెరకెక్కిన గరం సినిమాను రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరితో తలపడటానికి మంచు వారబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ లుక్తో మనోజ్ హీరోగా తెరకెక్కిన శౌర్య సినిమా కూడా అదే రోజు రిలీజ్కు రెడీ అవుతోంది.
ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావటం చిన్న సినిమాలకు అంత మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, అదే స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి గట్టెక్కెస్తాయి. కానీ చిన్న సినిమాల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాలో కంటెంట్ ఉండటంతో పాటు సరైన సమయంలో రిలీజ్ అయితే తప్ప కలెక్షన్లు సాధించే అవకాశం ఉండదు. మరి ఇలా ఒకేసారి బరిలో దిగుతున్న చిన్న సినిమాలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి.