'అ.. ఆ..' మూవీ రివ్యూ | a aa Movie Review | Sakshi
Sakshi News home page

'అ.. ఆ..' మూవీ రివ్యూ

Published Thu, Jun 2 2016 12:35 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

'అ.. ఆ..' మూవీ రివ్యూ

'అ.. ఆ..' మూవీ రివ్యూ

టైటిల్ : అ.. ఆ..
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా, నరేష్, రావు రమేష్
సంగీతం : మిక్కీ జే మేయర్
దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : సూర్యదేవర రాధాకృష్ణ

రెండు వరుస ఫ్లాప్ల తరువాత యంగ్ హీరో నితిన్ లీడ్ రోల్లో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అ.. ఆ..'. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. సమ్మర్ సీజన్కు సెండాఫ్ ఇవ్వటానికి వచ్చిన అ.. ఆ.. ఆశించిన స్థాయి విజయం సాధించిందా..? ఫ్లాప్లతో ఇబ్బందుల్లో ఉన్న నితిన్ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..? చాలాకాలం తరువాత స్టార్ హీరోలను పక్కన పెట్టి మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసిన త్రివిక్రమ్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా..?

కథ :
రామలింగం (నరేష్), మహాలక్ష్మి (నదియా)ల కూతురు అనసూయ (సమంత) ఎంట్రీతో సినిమా మొదలవుతోంది. తన జీవితంలో ప్రతి నిర్ణయం తన తల్లే తీసుకుంటుందన్న బాధలో ఉంటుంది అనసూయ. తన 23వ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ, ఓ బిలియనీర్ మనవడితో అనుసూయకు పెళ్లిచూపులు ప్లాన్ చేస్తుంది. ఆ నిర్ణయం నచ్చక అనసూయ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో తిరిగి అమ్మ చేతిలో తిట్లు తింటుంది. అదే సమయంలో మహాలక్ష్మి బిజినెస్ పని మీద చెన్నై వెళ్లటంతో తండ్రి సాయంతో ఆ పెళ్లి చూపులను రద్దు చేయిస్తుంది అనసూయ. మహాలక్ష్మి ఇంట్లో లేని సమయాన్ని ఆనందంగా గడపటం కోసం విజయవాడ దగ్గర కల్వపూడిలో ఉంటున్న మేనత్త కామేశ్వరి(ఈశ్వరీ రావ్) ఇంటికి వెళుతుంది.

సిటీలో లగ్జరీగా పెరిగిన అనసూయ అవసరాలు తీర్చటం, కామేశ్వరి కొడుకు ఆనంద్ విహారి(నితిన్)కి తలకు మించిన భారం అవుతుంది. అక్కడ ఉన్న పదిరోజుల్లో కుటుంబ బంధాల విలువ తెలుసుకుంటుంది అనసూయ. అదే సమయంలో ఆనంద్ విహారితో ప్రేమలో పడుతుంది. కానీ ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆనంద్ తన ప్రేమను బయటకు చెప్పలేకపోతాడు. అసలు మహాలక్ష్మి, కామేశ్వరిల కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి..? పల్లం వెంకన్న(రావు రమేష్)కు ఆనంద్ విహారికి సంబంధం ఏంటి..? చివరికి ఆనంద్ విహారి అనసూయ రామలింగాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగతా కథ.


నటీనటులు:
హీరో నితిన్ అయినా.. సినిమా ఎక్కువగా సమంత పాత్ర చూట్టూనే తిరుగుతుంది. అందుకు తగ్గట్టుగా సమంత కూడా అనసూయ పాత్రలో ఒదిగిపోయింది. సెంటిమెంట్, కామెడీ, అమాయకత్వం, పొగరు ఇలా అన్ని రకాల వేరియేషన్స్ను బాగా చూపించింది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. నితిన్, ఆనంద్ విహారిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ నటుడిగా నితిన్ రేంజ్ చూపించాయి. ఇక తల్లి పాత్రలో నదియా మరోసారి తన మార్క్ చూపించింది. నరేష్, అనుపమా పరమేశ్వరన్, అనన్య, ఈశ్వరీ రావ్, ప్రవీణ్, రావు రమేష్లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకుడిగా త్రివిక్రమ్ మరోసారి తన మార్క్ చూపించాడు. బరువైన ఎమోషన్స్ను తన మాటలతో ఎంతో సున్నితంగా చూపించాడు. అయితే త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే అ..ఆ..లో పెన్ను పవర్ అంతగా కనిపించలేదు. తన గత సినిమాల్లో కనిపించిన అదే తరహా సన్నివేశాలు, అవే ఎమోషన్స్ ను మరోసారి తెరమీద చూపించే ప్రయత్నం చేశాడు. నటరాజన్ సుబ్రమణియం సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా చూపించాడు. మిక్కి జె మేయర్ సంగీతం పరవాలేదు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సమంత క్యారెక్టర్
ఫస్ట్ హాఫ్ విలేజ్ సీన్స్
క్లైమాక్స్ డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ పెద్దగా లేకపోవటం
రొటీన్ టేకింగ్

ఓవరాల్గా అ..ఆ.. సమ్మర్ సీజన్కు గుడ్ బై చెప్పే కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement