వారం తర్వాత ‘ఆగడు’
మహేష్‌బాబుతో చేయబోయే ‘ఆగడు’ చిత్రంలో రియల్‌స్టార్ శ్రీహరి కోసం ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేశారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ, కింగ్ చిత్రాల్లో శ్రీహరి పాత్రలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. వాటిని తలదన్నే పాత్రను శ్రీహరికోసం శ్రీను వైట్ల సిద్ధం చేశారట. కానీ దేవుడు మరోలా తలచాడు. శ్రీహరి హఠాన్మరణం చెందకపోతే... మహేష్, శ్రీహరి కలిసి నటించే తొలి సినిమా ‘ఆగడు’ అయ్యేది. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసేది. నిజానికి ‘ఆగడు’ ప్రారంభోత్సవం ఈ నెల 11న గానీ, 14న గానీ నిర్వహించాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావించారు.
అయితే... శ్రీహరి కన్ను మూయ డంతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఓ వారానికి పోస్ట్‌పోన్ చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం శ్రీహరి స్థానంలో నటించే నటుడి అన్వేషణలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. కచ్చితంగా శ్రీహరి స్థాయి నటుణ్ణే ఎంపిక చేయాలనే కృతనిశ్చయంతో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే నిజమైతే... మహేష్, తమన్నా కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది.