
జైరాకు అండగా నిలిచిన ఆమిర్ ఖాన్
దంగల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న కశ్మీరీ నటి జైరా వసీం, అంతే వేగంగా వివాదాల్లోనూ చిక్కుకుంది. తను నటించిన దంగల్ ఘనవిజయం సాధించిన తరువాత కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసిన జైరాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జైరా, ముఖ్యమంత్రిని కలవడాన్ని కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ముడిపెడుతూ కొందరు ఆమెను రోల్ మోడల్గా చిత్రీకరిస్తూ ప్రచారం చేశారు. అదే సమయంలో ఆమె చర్యను తప్పు పడుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.
తన పై వస్తున్న కామెంట్స్కు వివరణ ఇచ్చిన జైరా వసీం, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. అయినా కామెంట్స్ ఆగకపోవటంతో బాలీవుడ్ ఆమెకు అండగా నిలిచింది. ఇప్పటికే పలువరు బాలీవుడ్ ప్రముఖులు జైరాకు మద్దతుగా ట్వీట్ చేయగా తాజాగా దంగల్ హీరో ఆమిర్ కూడా జైరాకు అండగా నిలిచాడు. 'జైరా.. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేమంతా నీతోనే ఉన్నాం. నీలాంటి బాలలు ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలలకు ఆదర్శం. నువ్వు నాకు కూడా ఆదర్శం'. అంటూ ట్వీట్ చేశాడు.
అదే సమయంలో సోషల్ మీడియాలో జైరా పై విమర్శలు చేస్తున్న వారికి కూడా ఓ విజ్ఞప్తి చేశాడు ఆమిర్. 'పదహారేళ్ల వయసులో జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న జైరాకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకావమివ్వండి'. అంటూ ట్వీట్ చేశాడు.
— Aamir Khan (@aamir_khan) 17 January 2017