తొమ్మిది నెలలైనా కలెక్షన్లు తగ్గలేదు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా విడుదలయి తొమ్మిది నెలలు కావొస్తున్నా వసూళ్ల వరద కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కంటే చైనాలో అత్యధిక కలెక్షన్లు తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా హాంగ్‌కాంగ్‌లోనూ సత్తా చాటుతోంది. కుస్తీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రరాజం హాంగ్‌కాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గురువారం విడుదలైన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో రూ.2.95 కోట్లు వసూలు చేసినట్టు మూవీ మార్కెట్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ముఖ్యంగా శనివారం భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
కుస్తీ యోధుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా నితీశ్ తివారి రూపొందించిన ఈ మూవీ భారత సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక్క చైనాలోనే దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 23న మనదేశంలో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. తర్వాత చైనాలో ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదలై ప్రభంజనం సృష్టించింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు రూ.2000 కోట్లు దాటాయి.