హీరో నిరాహార దీక్ష
లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆదిత్య ఓం దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాకు అవసరం మేర థియేటర్లు కేటాయించనందుకు నిరసనగా ఆదిత్య ఓం, సహ నిర్మాత విజయ్ వర్మ చిత్రబృందంతో నిన్న ఫిలిం చాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.
వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 150 థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశామన్నారు. అయితే నైజాంలో బిందు పిక్చర్స్ శ్రీనివాస్ 30 థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పి కేవలం ఒక్క థియేటర్లో.. అది కూడా రెండు షోస్ మాత్రమే వేస్తామని చివరి నిమిషంలో చెప్పారన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అమలు చేస్తున్నట్టుగా ప్రాంతీయ చిత్రాలకు థియేటర్ల కేటాయింపు పద్దతిని ఇక్కడ కూడా అమలు చేసేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.
వీరికి భారత్ ఏక్తా ఆందోళన్ నేషనల్ కన్వీనర్ మల్లు రమేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కె సురేష్ బాబు, మోహన్ గౌడ్లు మద్దతు పలికారు. ఫిలిం చాంబర్ ఈసీ మెంబర్ అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.