
నానికి బంపర్ ఆఫర్!
ఇది నాని టైమ్ అని చెప్పాలి. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న నానీని ఓ బంపర్ ఆఫర్ వరించిందని సమాచారం. అవును మరి.. మణిరత్నం సినిమా అంటే బంపరే కదా. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో ఆ చిత్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ పాత్రకు తెలుగు వెర్షన్‌లో నాని డబ్బింగ్ చెప్పారు.
మణిరత్నం మీద ఉన్న అభిమానంతో వాయిస్ ఇచ్చానని ఆ టైమ్‌లో నాని పేర్కొన్నారు. ఇక, ఈ స్టార్ డెరైక్టర్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వస్తే ఊహూ అంటారా? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇటీవల నానీకి మణిరత్నం ఫోన్ చేశారట. త్వరలో తాను తెరకెక్కించే చిత్రం గురించి నానీకి చెప్పారని సమాచారం. ఈ ద్విభాషా చిత్రంలో ఓ హీరోగా కార్తీని, మరో హీరోగా నానీని తీసుకోవాలనుకుంటున్నారట. ఆ విషయమే నానీతో చెప్పారని బోగట్టా. ఫోన్‌లో మాట్లాడుకున్న మణి, నాని త్వరలో వ్యక్తిగతంగా కలిసి ఇతర విశేషాలు మాట్లాడుకోనున్నారని తెలిసింది.