'ఇప్పుడు నేను మిలియనీర్'
'ఇప్పుడు నేను మిలియనీర్'
Published Tue, Apr 5 2016 10:59 AM | Last Updated on Tue, Oct 2 2018 3:43 PM
ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్, తన అనుభవాలను మీడియతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్తో పాటు తన జీవితంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తు చేసుకున్న ఆయన, కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ' ఇప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయటం లేదు. నటుడిగా నాకు తృప్తినిచ్చే పాత్రలు మాత్రమే అంగీకరిస్తున్నా' అంటున్న నరేష్. బ్రహ్మోత్సవం, అ..ఆ..తో పాటు మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.
తనకు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడాలు తెలియదని, మంచి సినిమా అయితే తన రెమ్యూనరేషన్ తగ్గించుకొనైనా ఆ సినిమాలో నటిస్తానన్నారు. నటుడిగా ఎన్నో విజయాలు సాధించిన నరేష్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పొలిటికల్ కెరీర్ కోసం సినిమాలను పక్కన పెట్టెయ్యడంతో ఆర్థికంగా వెనకపడ్డారు.
ఆ సమయంలో స్నేహితులు, బంధువులు కూడా తన గురించి తప్పుగా మాట్లాడారన్న నరేష్ ఇలాంటి ఇబ్బందుల వల్లే జీవితంలో ఎన్నో తెలుసుకోగలిగానని చెప్పారు. సమస్యల్లో ఉన్నప్పుడు తనను వదిలి వెళ్లిన మొదటి భార్య రేఖతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. విడాకుల అనంతరం నరేష్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన భార్య రమ్య అనుమతితో ఈ రిలేషన్ కొనసాగుతోందన్నారు. రేఖ తనకు మంచి ఫ్రెండ్ అని నరేష్ తెలిపారు.
ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న ఈ సీనియర్ యాక్టర్, ఇప్పుడు నేను మిలియనీర్ అని గర్వంగా చెపుతున్నారు. తన వారసుడిగా కొడుకు నవీన్ను సినీరంగానికి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నా, మరో పదేళ్ల పాటు సినీరంగంలోనే కొనసాగుతానని తెలిపారు.
Advertisement
Advertisement