తెరపైకి కుమారుడు | The son of the fore | Sakshi
Sakshi News home page

తెరపైకి కుమారుడు

Published Fri, Sep 19 2014 2:24 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

తెరపైకి కుమారుడు - Sakshi

తెరపైకి కుమారుడు

  • త్వరలో నిఖిల్ గౌడ సినీ అరంగేట్రం
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ శాసన సభా పక్షం నాయకుడు హెచ్‌డీ  కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ త్వరలోనే సినిమా అరంగేట్రం చేయనున్నారు. భారీ బడ్జెట్ సినిమాను దీపావళి నాటికి ప్రారంభించి, సంక్రాంతి నాటికి విడుదల చేయాలనేది ప్రస్తుత లక్ష్యం. ఈ దిశగా కుమార స్వామి కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. ఆయనకు సినిమా రంగం కొత్తేమీ కాదు. అనేక సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా...ఇలా చిత్ర రంగంలో బహుముఖ పాత్రలను పోషించారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు ‘తెర’ వెనుక ఒక వెలుగు వెలిగారు.

    రాజకీయాల్లో జేడీఎస్ పురోగతి ఆశాజనకంగా లేకపోవడం, జేడీఎస్ కుటుంబ పార్టీ అనే విమర్శలు తరచూ వినిపిస్తుండడం... నిఖిల్ గౌడ రాజకీయ వైరాగ్యానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల  ఆయన పార్టీ పరంగా ఒకటి, రెండు సందర్భాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఎప్పుడూ చురుకుగా కనిపించ లేదు. కుమార స్వామి సైతం తన కుమారుడు తొలుత సినిమాల్లో రాణిస్తే, తదుపరి రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    కనుక తొలి సినిమానే ఎటు లేదన్నా...రూ.25 కోట్ల వ్యయంతో భారీ హంగులతో నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. కుమార స్వామి ఇదివరకే ‘చెన్నాంబిక ఫిల్మ్స్’కు అధిపతి. ఆ బ్యానర్‌పైనే అదిరిపోయే సినిమా తీయాలని ఆయన ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ‘దూకుడు’ రీమేక్ ‘పవర్’కు దర్శకత్వం వహించిన మాదేశ్ లేదా దర్శక దిగ్గజం కేవీ. రాజు డెరైక్షన్‌లో సినిమాను నిర్మించాలనేది ప్రాథమిక ఆలోచన. తొలి సినిమా కనుక పక్కన హీరోయిన్ కూడా ఆకర్షణీయంగా ఉండాలని పలు పేర్లను పరిశీలించారు.

    అంతిమంగా సమంత లేదా కాజోల్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. క్లాస్ అండ్ మాస్ మిళితంగా చిత్రంగా ఉండాలని, ఈ క్రమంలో తెలుగులో మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్‌ల సూపర్ డూపర్ హిట్లలో ఒక దానిని రీమేక్ చేయాలని కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాకు మంచి పేరును సూచించాల్సిందిగా సినీ రంగంలోని ప్రముఖులతో పాటు ప్రజలను కూడా కోరే అవకాశాలున్నాయి.

    దీనిపై కుమార స్వామి ఇదివరకే ప్రముఖ డెరైక్టర్లతో రెండు దఫాలుగా చర్చించినట్లు తెలిసింది. నిఖిల్ సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించాలనేది తండ్రి ఆశయం కాగా అతను వ్యాపార దిగ్గజంగా వెలుగొందాలనేది తల్లి, మాజీ ఎమ్మెల్యే అనితా కుమార స్వామి కోరిక. తమ కుటుంబం ఆధ్వర్యంలోని కస్తూరి టీవీ  ఛానెల్‌ను ప్రస్తుతం నిఖిల్ చూస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అతను పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు.
     
    సింగపూర్‌కు కుమార స్వామి


    ఆరోగ్య పరీక్షల నిమిత్తం కుమార స్వామి సింగపూర్‌కు వెళ్లారు. భార్య అనితా కుమార స్వామితో కలసి బుధవారం రాత్రి ఆయన కెంపే గౌడ  అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వైద్య పరీక్షల అనంతరం  శని లేదా ఆదివారం తిరిగొస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement