సినిమాల్లోకి రాకముందు పేపర్ కవర్లు తయారు చేసేవాణ్ణి! | actor Upendra Birthday Special | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి రాకముందు పేపర్ కవర్లు తయారు చేసేవాణ్ణి!

Published Wed, Sep 17 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

సినిమాల్లోకి రాకముందు పేపర్ కవర్లు తయారు చేసేవాణ్ణి!

సినిమాల్లోకి రాకముందు పేపర్ కవర్లు తయారు చేసేవాణ్ణి!

కొంచెం అతిగానూ... మరికొంచెం అతిశయంగానూ... ఒక్క ముక్కలో చెప్పాలంటే తిక్కతిక్కగా ఉంటాయ్ ఉపేంద్ర సినిమాలు. ఆ విభిన్నతే కన్నడ హీరో అయిన ఉపేంద్రను తెలుగులో కూడా క్రేజీ స్టార్‌ను చేశాయి. ఎ, ఉపేంద్ర, రా... ఇలాంటివిచిత్రమైన టైటిల్స్‌తో అప్పట్లో ఉపేంద్ర చేసిన సినిమాలన్నీ మాస్‌కి మంచి కిక్ ఇచ్చాయి. కన్నడంలో బిజీగా ఉన్న ఉపేంద్ర...త్వరలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నారు. నేడు ఉపేంద్ర బర్త్‌డే. ఈ సందర్భంగా ‘సాక్షి’ స్పెషల్ టాక్.
 
 అప్పట్లో తెలుగులో వరుసగా సినిమాలు చేశారు కదా.. ఇప్పుడెందుకు చేయడంలేదు?
 కన్నడ చిత్రాలతో బిజీ కావడంవల్ల తెలుగులో చేయడం కుదరలేదు. వాస్తవానికి అప్పట్లో నాకు కర్ణాటకలో ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులో కూడా అంతే ఫాలోయింగ్ ఉండేది. అందుకే తెలుగు సినిమాలకు దూరమైనందుకు కొంచెం బాధగానే ఉంది.
 
 మళ్లీ తెలుగులో ఎప్పుడు?
 ప్రస్తుతం నేను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఉప్పి 2’ని తెలుగులో విడుదల చేయబోతున్నాను. అప్పట్లో నేను చేసిన ‘ఉపేంద్ర’కి సీక్వెల్ ఇది. ఇకనుంచి నేను కన్నడంలో చేసే సినిమాలు తెలుగు నేటివిటీకి కూడా అనుగుణంగా ఉందనిపిస్తే, ఇక్కడ కూడా విడుదల చేస్తా.
 
 గతంలో మీరు చేసిన ఉపేంద్ర, రా, ఎ తదితర  చిత్రాల్లో మీ పాత్రలు శాడిస్టిక్ తరహాలా ఉంటాయి. బయట కూడా అలా ఉంటారేమోనని చాలామంది అనుకుంటుంటారు కూడా?
 అయ్య బాబోయ్.. రియల్ లైఫ్‌లో నేను చాలా సాఫ్ట్ అండి.  ఆ కథలు అలా కుదిరాయి. అందుకని చేశాను. ఆ సినిమాల్లో నా లుక్స్‌కీ నా రియల్ లుక్స్‌కి అస్సలు పోలికే ఉండదు. నిజంగా నేను కొంచెం హుందాగా ఉంటాను. అలాగే, ఆ సినిమాల్లో వేసుకున్నట్లుగా విచిత్రమైన బట్టలు వేసుకోను.
 
 ముఖ్యంగా ‘ఉపేంద్ర’ సినిమాలో మీది ఆడవాళ్లను ఆడిపోసుకునే పాత్ర కదా..?
 ఆడవాళ్లంటే నాకు చాలా గౌరవం. ఆ చిత్రంలో ఆడవాళ్లనే కాదు... మగవాళ్ల గురించి కూడా కొన్ని నిజాలు చెప్పాం. ఆ నిజాలను చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అప్పట్లో అంతలా ముక్కుసూటిగా చెప్పిన సినిమాలు లేవు. దాంతో కొంచెం ఇబ్బందిపడ్డారు. అది ఇప్పుడు తియ్యదగ్గ సినిమా. అప్పట్లో నేను చేసిన రెండు, మూడు చిత్రాలు ఇప్పటి ట్రెండ్‌కు కరెక్ట్.
 
 ఓకే.. ఓసారి మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారట?
 నిజమే. మా నాన్నగారు ‘వంటవాడు’. రోజుకి 50, 60 రూపాయలు మించి సంపాదన ఉండేది కాదు. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను.. ఉన్నదాంట్లోనే సర్దుకుని హ్యాపీగా ఉండేవాళ్లం. మన కుటుంబ పరిస్థితి ఇలా ఉందేంటి? అని ఎప్పుడూ బాధపడలేదు. అందుకే ఒకవైపు చదువుకుంటూ మరోవైపు పని చేసేవాణ్ణి. రోజుకి 15, 20 రూపాయలు సంపాదించేవాణ్ణి.
 
 ఏం పని చేసేవారు?
 కూరగాయలు, పండ్లు, సరుకులు క్యారీ చేసుకునేందుకు వీలుగా ‘పేపర్ కవర్స్’ తయారు చేసేవాణ్ణి. అలాగే, బూందీ, మిక్సర్ ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు తయారు చేసేవాణ్ణి.
 
 మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?
 కాలేజ్ డేస్‌లో నేను నాటకాల్లో నటించేవాణ్ణి. కథలు, మాటలు రాసేవాణ్ణి. ప్రముఖ కన్నడ దర్శకుడు కాశీనాథ్ మాకు దూరపు బంధువు అవుతారు. ఆయన్ను కలిసి నేను రాసుకున్న నాటకాలకు సంబంధించిన కథలు, సంభాషణలు చూపించాను. దాంతో ఆయన నన్ను ‘అజగజంతారా’ అనే చిత్రానికి సహాయదర్శకునిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత కాశీనాథ్‌గారి దగ్గరే కొన్ని సినిమాలకు పని చేశాను.
 
 అప్పట్లో మీ లక్ష్యం దర్శకత్వమా? నటనా?
 ఏ లక్ష్యమూ లేదు. ఏ పని దొరికితే అది చేద్దామనుకున్నాను. అనుకోకుండా కాశీనాథ్‌గారు ‘అజగజంతారా’లో ఓ అతిథి పాత్ర చేయమన్నారు. ఎలాగూ నాటకాల్లో నటించాను కాబట్టి, చేశాను. కొంత అనుభవం సంపాదించుకున్న తర్వాత ‘తర్లే నాన్ మగ’ అనే చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యాను.
 
 దర్శకునిగా ‘ఓం’ చిత్రం మిమ్మల్ని రాత్రికి రాత్రి స్టార్ డెరైక్టర్‌ని చేసేసింది. అప్పుడు ఎలా అనిపించింది?
 కష్టపడినవాళ్లకి ప్రతిఫలం దక్కుతుందనే ఆనందం లభించింది. ఆ తర్వాత నేను హీరోగా నటిస్తూ ‘ష్’, ‘ఉపేంద్ర’ చిత్రాలు చేశాను. అవి కూడా మంచి గుర్తింపు తెచ్చాయి. నా జీవితం ‘ఇంత బాగుండాలి.. నా ఆర్థిక స్థితి ఇంత భారీగా ఉండాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆ దేవుడు చాలానే ఇచ్చాడు.
 
 ఒకవైపు దర్శకునిగా, నటుడిగా, మంచి రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. మధ్యలో కొన్ని పరాజయాలు కూడా చూశారు కదా?
 ‘మనం ఇలానే ఉండాలి... ఇదే చేయాలి’ అని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ఏది వస్తే అది తీసుకున్నాను. ఏం చేసినా సిన్సియర్‌గా చేశాను. జయాపజయాలకు అతీతంగానే స్పందిస్తుంటాను.
 
 పాటలు కూడా పాడుతుంటారు.. అదెప్పుడు మొదలైంది?
 ఓసారి ఏదో సినిమా కోసం జస్ట్ ట్రాక్ పాడమంటే పాడాను. చాలా బాగుందని దాన్నే ఉపయోగించారు. ఆ తర్వాత కొంతమంది అడిగితే పాడాను. అప్పట్నుంచీ వరుసగా పాటలు  పాడుతున్నాను. ఇతర హీరోలకు కూడా చాలా పాటలు పాడాను.
 
 ‘ఉపేంద్ర’ తర్వాత దాదాపు పదేళ్లు దర్శకత్వం జోలికి వెళ్లకపోవడానికి కారణం?
 హీరోగా బిజీ కావడంవల్లే. దాంతో కథలు తయారు చేసుకునే వీలు చిక్కలేదు. ఇప్పుడున్న బిజీలో యాక్టింగ్, డెరైక్షన్ అంటూ రెండు పడవల మీద కాళ్లు అవసరమా అనిపించింది. అందుకే చేయలేదు.
 
 మీ కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది?
 మొదట్లో నాకో లక్ష రూపాయలు చెక్ ఇస్తే తడబడిపోయేవాణ్ణి. అంత డబ్బు అంతకు ముందు చూడలేదు. కొన్ని విషయాలు చెప్పడానికి మొహమాటపడాల్సిన అవసరంలేదు. నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. అందుకని డబ్బులు ఎక్కడ దాచుకోవాలో తెలిసేది కాదు. కొంచెం స్థాయి పెరిగిన తర్వాత మేనేజర్‌ని పెట్టుకున్నాను.
 
 ఓకే.. హీరోయిన్ ప్రియాంక త్రివేదీతో మీ ప్రేమకథ గురించి?
 ‘రా’ సినిమాలో చేస్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య స్నేహం మొదలై, ‘హెచ్2ఓ’ సినిమా టైమ్‌కి ప్రేమగా మారింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నాం.
 మీ పిల్లల గురించి?
 మా బాబు అయుష్ ఐదో తరగతి, పాప ఐశ్వర్య నాలుగో తరగతి చదువుతున్నారు.
 
 సరే.. ఈ బర్త్‌డే ఎలా చేసుకోబోతున్నారు?
 సినిమాల్లోకి రాకముందు నేను సెలబ్రేట్ చేసుకున్నది లేదు. ఇక్కడికొచ్చాక అభిమానులు నా పుట్టినరోజుని ఓ పండగలా చేయడం మొదలుపెట్టారు. ఆ రోజంతా అభిమానులకు కేటాయించేస్తాను. ఎక్కడెక్కణ్ణుంచో వచ్చే అభిమానుల్ని పలకరిండంలో నాకు లభించే ఆనందం గురించి మాటల్లో చెప్పలేను.
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement