నేను ద్రోహిని కాదు! | Actor Vijay hits out at rumours | Sakshi
Sakshi News home page

నేను ద్రోహిని కాదు!

Published Sat, Sep 20 2014 1:40 AM | Last Updated on Wed, Apr 3 2019 8:57 PM

నేను ద్రోహిని కాదు! - Sakshi

నేను ద్రోహిని కాదు!

నేను త్యాగిని కాను. అలాగని ద్రోహినీ కాదు. తమిళనాడుకు చెందిన వాడిని. ఒక తమిళ కళాకారుడిని అంటూ ప్రముఖ నటుడు విజయ్ తెలిపారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం కత్తి. అందాలభామ సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్నారు.

చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక రాజా అన్నామలైపురంలోని నక్షత్ర హోటల్‌లో జరిగింది. కాగా కత్తి చిత్రంపై పలు తమిళ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక తమిళులకు ఊచకోత కోసిన ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేతో లైకా ప్రొడక్షన్ అధినేతలకు సన్నిహిత సంబంధాలున్నాయనేదే వారి వ్యతిరేకతకు ప్రధాన కారణం. కాగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ చిత్ర కథా నాయకుడు మాట్లాడుతూ తన చిత్రాల గురించి తానెప్పుడూ గొప్పగా చెప్పుకోనన్నారు. అయితే కత్తి చిత్రం తనకు చాలా ముఖ్యమైనదని చెప్పారు.

ఏఆర్ మురుగదాస్ చిత్రంలో ఇంతకుముందు నటించిన తుపాకీ చిత్రం మంచి విజయం సాధించిందన్నారు. మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. ఈ చిత్రంపై జరుగుతున్న ప్రచారం గురించి తెలిసిందేనన్నారు. తానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయదలచుకున్నానన్నారు. తాము చిత్రం చేసేది వివాదాల కోసమో, ఇంకా దేని కోసమో కాదన్నారు.

ప్రజలను సంతోష పరచాలనే ఏకైక లక్ష్యంతోనే చిత్రాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాను త్యాగిని కాదని, అలాగే ద్రోహినీ కాదని, తాను తమిళ కళాకారుడినని విజయ్ వ్యాఖ్యానించారు. కత్తి చిత్రంలో సమంత పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందని, ఆమె చాలా బాగా నటించారని అన్నారు. తమ మధ్య కెమిస్ట్రీ కూడా అందంగా ఉంటుందని, కత్తి చిత్రం దీపావళికి తెరపైకి రానుందని విజయ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement