ఐశ్వర్యా రాజేష్
‘‘నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు తక్కువగా చేయడం నా కెరీర్ ఎదుగుదలకు మైనస్ అవుతుందని అనుకోవడం లేదు. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. బాగానే సంపాదిస్తున్నా’’ అన్నారు ఐశ్వర్యా రాజేష్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కేయస్ రామారావు నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కథానాయికలుగా రాశీఖన్నా, కేథరీన్ , ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా నటించారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఐశ్వర్యా రాజేష్ చెప్పిన విశేషాలు.
► 2018లో ఓ అవార్డు ఫంక్షన్ కోసం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు క్రాంతిమాధవ్‌గారు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నాకు తెలిసి గత పదేళ్లలో సువర్ణలాంటి పాత్రను ప్రేక్షకులు చూసి ఉండరు. ఈ సినిమాలో నాతో పాటు ముగ్గురు హీరోయిన్లు నటించారు. కానీ కథ రీత్యా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది.
► విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో హీరోయిన్స్‌కు మంచి పాత్రలు దక్కాయనిపించింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నా పాత్ర బాగానే ఉంటుంది. క్రాంతిమాధవ్‌గారు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. సహజత్వానికి చాలా దగ్గరగా సినిమాలు తీస్తుంటారు. కేయస్ రామారావుగారు మంచి నిర్మాత.
► కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సన్నివేశాలు తప్పవు. అనవసరంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండకూడదు. నేను నటించిన ‘వడచెన్నై’ చిత్రంలో నాలుగు లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయి. ఈ తరంలో దాదాపు అందరూ ఓపెన్ గానే ఉంటున్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమా ఫ్లా్లప్ అయితే హీరోయిన్ అన్‌లక్కీ అని కొందరు అంటుంటారు. ఆ లాజిక్ నాకు అర్ధం కాదు.
► ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. జయలలితగారి బయోపిక్‌లో నటించాలనుకున్నాను. ఇప్పుడు జయలలితగారి బయోపిక్స్ వస్తున్నాయి. నా ఫేవరెట్ యాక్ట్రస్ సౌందర్యగారి బయోపిక్‌లో నటించాలని ఉంది. కాకపోతే కాస్త నా కలర్ తక్కువగా ఉంటుందేమో (నవ్వుతూ). తమిళంలో నేను నటించిన ‘వానమ్ కొట్టటుమ్’ సినిమా ఈ నెల 7న విడుదలవుతుంది. విజయ్ సేతుపతిగారితో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నాని ‘టక్ జగదీష్’లో కీలక పాత్ర చేస్తున్నాను.
► నా చిన్నప్పుడే మా నాన్నగారు (రాజేష్) మరణించారు. ‘కాక్కముట్టై’ (2014) సినిమాకు ముందు నా పేరు స్క్రీన్ పై ఐశ్వర్య అని ఉండేది. ఆ తర్వాత ఐశ్వర్యా అయ్యర్, ఐశ్వర్యా లక్ష్మీ ఇలా కొంతమంది ఐశ్వర్య పేరుతో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నా పేరు మార్చుకోవాలనుకున్నాను. ‘కాకముట్టై’తో నా పేరును ఐశ్వర్యా రాజేష్‌గా మార్చుకున్నాను. ఆ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది. మా నాన్నగారి పేరు నాకు కలిసొచ్చింది. అలాగే మా నాన్న నాతోనే ఉన్నారనే ఫీలింగ్ కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment