జయంతి
ప్రముఖ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మాతృభాష కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారామె.
‘భార్యా భర్తలు’ చిత్రంతో తెలుగులో పరిచయమైన ఆమె ‘జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరి, దొంగ మొగుడు, కొదమ సింహం, కలియుగ పాండవులు, ఘరానా బుల్లోడు, వంశానికొక్కడు, పెదరాయుడు’.. ఇలా.. దాదాపు 55 చిత్రాలకుపైగా నటించారు. కొద్ది సంవత్సరాల నుంచి ఆమె ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జయంతికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. కాగా జయంతి తనయుడు కృష్ణకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘అమ్మకి ప్రస్తుతం వైద్యం అందుతోంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి రెండు రోజులు పరిశీలనలో ఉండాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమ్మని చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment