చెన్నై : అందాల పోటీలు రద్దు కావడంతో కార్యక్రమ నిర్వాహకురాలు నటి మిరామిథున్ మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...‘ 8 తోటాగళ్’ చిత్ర నాయకి మీరామిథున్ 2016 ఏడాది మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కిరీటాన్ని గెలుచుకోవడంతో....తనే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. దీంతో తనకు మిస్ సౌత్ ఇండియా పట్టాన్ని అందించిన నిర్వాహకులు ఆమెను పోటీలు నిర్వహించరాదని హెచ్చరించారు. అంతే కాకుండా తాము ఆమెకి అందించిన మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని తిరిగి తీసేసుకుని, ఆ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన నటి సనంశెట్టికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పట్టాని నటి మీరామిథున్ ఉపయోగించుకోరాదని హెచ్చరించారు.
దీంతో వారిపై ఇటీవల నటి మీరా మిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను నిర్వహించనున్న అందాల పోటీల కార్యక్రమానికి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. పోలీసులు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చినట్లు మీడియాతో పేర్కొన్న నటి మీరామిథున్ సోమవారం తాను నిర్ణయించినట్లుగా స్థానిక వడపళనిలోని ఒక నక్షత్ర హోటళ్‌లో అందాల పోటీల ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. అలాంటిది అందాల పోటీలు జరగలేదు.
ఈ విషయమై నటి మీరామిథున్ స్థానిక మైలాపూర్‌లో మీడియాతో తన గోడును వెల్లబోసుకున్నారు. తాను రెండు రోజులుగా రేయింబవళ్లు కష్టపడి అందాల పోటీలకు అన్ని ఏర్పాట్లను చేసుకున్నానని.. పోటీల్లో పాల్గొనడానికి 11 మంది మోడల్స్ సిద్ధం అయ్యారని చెప్పారు. సోమవారం ఉదయం ఆర్గనైజర్లకు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. దీంతో తానే స్వయంగా వెళ్లి వారిని కలవగా అందాల పోటీలను నిర్వహించరాదని చెప్పారన్నారు. అంతేగాకుండా ఇద్దరు పోలీసులతో హోటల్‌కు వచ్చి తనను బెదిరించారని కంటతడి పెట్టారు. త్వరలో మళ్లీ అందాల పోటీలు నిర్వహించి తీరుతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment