కనువిప్పు కలిగింది
కనువిప్పు కలిగింది
Published Sat, Aug 24 2013 12:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
ప్రపంచంలోనే చాలా కష్టమైన విషయం... కామెడీ చేయడం అంటున్నారు సమంత. అందుకే కమెడియన్లందరికీ సెల్యూట్ అని పేర్కొన్నారామె. సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా, అందర్నీ నవ్వించగలగడం ఓ వరం అని కూడా ఆమె అన్నారు. దీన్నిబట్టి సమంత కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితాన్ని మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకుంటారామె. ఏదో నాలుగు సినిమాలు చేశాం... బ్యాంక్ బాలెన్స్ పెంచేసుకుందామనే దృక్పథం కాదు సమంతది.
దేవుడు మనకెంతో ఇచ్చినప్పుడు కొంత ఇతరులకు ఇస్తే ఏంటి? అంటారు సమంత. దీని గురించి విపులంగా చెబుతూ -‘‘ఒకప్పుడు నా గురించి తప్ప, నేను ఇతరుల గురించి ఆలోచించేదాన్ని కాదు. నా లుక్స్ ఎంత బాగుండాలి, ఎంత బ్రైట్‌గా కాస్ట్యూమ్స్ వేసుకోవాలి? ఎన్ని సినిమాలు చేయాలి?.. ఇలా నా ధ్యాసంతా వాటి మీదే. కానీ ఆ మధ్య నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో నాకు కనువిప్పు కలిగింది. ఆ దేవుడే నాకు పాఠం నేర్పాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు జీవితం చాలా మటుకు అర్థం అయ్యింది.
ఒక సినిమా ఎవరినైనా స్టార్‌ని చేయగలదు.. ఆ స్థాయి నుంచి అమాంతం కింద పడేయగలదనే విషయం తెలుసుకున్నాను. సినిమాల ద్వారా వచ్చే పేరు, డబ్బుని ఎంజాయ్ చేస్తూ బాధ్యతలు మర్చిపోయానని జ్ఞానోదయం కలిగింది. అందుకే నా పద్ధతి మార్చుకున్నాను. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అన్నారు సమంత. ఇప్పటికే ప్రత్యూష అనే సేవా సంస్థకు తన వంతు సహాయం చేస్తున్నారామె. ఇంకా సేవా కార్యక్రమాలను విస్తరించాలనే ఆలోచన కూడా సమంతకు ఉంది.
Advertisement