Pratyusa
-
ప్రత్యూష పరిస్థితిపై నివేదిక ఇవ్వండి
హోంశాఖను ఆదేశించిన హైకోర్టు ఈ ఘటనపై చలించిపోయిన జస్టిస్ చల్లా కోదండరామ్ సుమోటో పిటిషన్‌గా తీసుకోవాలని తాత్కాలిక సీజేకు లేఖ అంగీకరించి.. విచారించిన ధర్మాసనం హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన 19 ఏళ్ల యువతి ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ హోంశాఖ అధికారులను ఆదేశించింది. ప్రత్యూష ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. వైద్యులెవరు.. ఆమెను చూసేందుకు ఇప్పటి వరకు ఎవరైనా బంధువులు వచ్చారా.. వస్తే వారి వివరాలు.. ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి.. ద్రవాహారమే ఎందుకు అందిస్తున్నారు.. ప్రత్యూష ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు.. బాధ్యులుపై ఏం చర్యలు తీసుకున్నారు.. పరారీలో ఉన్న తండ్రిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూ ర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి ఆమెచేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక సీజే జస్టిస్ బొసాలేకు లేఖ రాశారు. పత్రికల కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. ఈ లేఖను పరిశీలించిన జస్టిస్ బొసాలే పత్రిక కథనాలను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చారు. ఆ మేరకు దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఏ దశలోనూ దీనిని తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యూష ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. రక్షిత గృహాల విషయంలోనూ నిలదీత కాగా, రక్షిత గృహాల ఏర్పాటు విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, ఈ విషయంలో చట్ట నిబంధనలను చదివి రావాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులకు హైకో ర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తుంటే, మీరు (ప్రభుత్వ న్యాయవాది) మాత్రం చాలా తేలిగ్గా తీసుకుం టున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం రక్షిత గృహాలను ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛం ద సంస్థ ‘ప్రజ్వల’ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. -
ప్రత్యూషకు నేతల అండ
ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన ఎంపీ కవిత ఉచిత వైద్యం, విద్యతో పాటు ఉద్యోగం కల్పిస్తామని హామీ రూ. 20 వేలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హైదరాబాద్: సవతి తల్లి పైశాచికత్వానికి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష (16) పై శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నేతలు స్పందించారు. అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం రాత్రి నిజామాబాద్ ఎంపీ కవిత వచ్చి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చదువుతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. చిత్రహింసల నుంచి బాలికను కాపాడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావును ఆమె ఈ సందర్భంగా అభినందించారు. అలాగే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడా ఆస్పత్రికి వచ్చి సంఘటన జరిగిన తీరును ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఉచితంగా వైద్య సేవలు అందించిన అవేర్ గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యూషకు చేయవలసిన సహాయ, సహకారాలు త్వరలో అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ వూజీ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యూషను పరామర్శించి ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు, మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి రూ. 5 వేలను ఆస్పత్రి సీఈఓ వేమూరి విజయకుమార్‌కు అందజేశారు. ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తదితరులు ప్రత్యూషను పరామర్శించారు. -
ఆస్తి కోసం ఉన్మాదం
తల్లి, భార్య, కూతురిని గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి బాలాపూర్‌లో ఘోరం హైదరాబాద్: ఆస్తిపై పెంచుకున్న మమకారం ముందు రక్త సంబంధం ఓడింది. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురి గొంతుకోసి ముగ్గురినీ దారుణంగా హత్యచేశాడు. మరో కుమార్తె త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంత బాలాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు సంరెడ్డి బల్వంత్‌రెడ్డి, సుభద్ర(65) దంపతుల కుమారులు గోవింద్‌రెడ్డి, రాంరెడ్డి. 2013లో సాయినగర్‌లో నిర్మించిన కొత్త భవనంలోకి వీరంతా మకాం మార్చారు. మొదటి అంతస్తులో రాంరెడ్డి తన భార్య రాధిక (36), కుమార్తెలు ప్రత్యూష (16), అక్షయ (14)లతో నివాసముంటుండగా రెండో అంతస్తులో ఉంటున్న గోవింద్‌రెడ్డి తల్లిదండ్రులనూ తనవద్దే ఉంచుకున్నాడు. ఇల్లు నచ్చలేదంటూ... ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే రాంరెడ్డి తనకు ఇల్లు నచ్చడం లేదని, వేరే ఇల్లు కట్టుకుంటానంటూ అందరికీ తరచూ చెప్పేవాడు. వారు అతని ప్రతిపాదనను వ్యతిరేకించేవారు. ఇలా అతని ధోరణిలో మార్పు రాకపోవడంతో పాటు ఆస్తికోసం వేధింపులు పెరగడంతో తండ్రి బల్వంత్‌రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన ఇరువురి కోడళ్ల పేరిట రాశాడు. ఇది వారి మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి. సొంత కుటుంబీకులూ అతని తీరును వ్యతిరేకించ డంతో అందరిపైనా రాంరెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు నిద్రపోతున్న భార్య రాధిక గొంతును కత్తితో కోసి చంపాడు. అదే విధంగా నిద్రలో ఉన్న తల్లినీ హత్య చేశాడు. ఆమె పక్కనే పడుకున్న కూతుళ్లు అక్షయ, ప్రత్యూషలు పరిస్థితిని గమనించి పారిపోయేందుకు యత్నించగా అక్షయను వెంబడించి వంటగదిలో అంతమొందించాడు. ప్రత్యూష మాత్రం బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని కేకలు వేసింది. దీంతో అదే ఇంట్లో పై పోర్షన్లో ఉన్న గోవింద్ కిందికి రాగానే రాంరెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఏసీపీ సుదర్శన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా బయటకు వెళ్లిన నిందితుడు సాయిహోమ్స్కాలనీలోని ఓ బావిలోకి దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాంరెడ్డి తనకు కారు కొనివ్వాలంటూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది. -
కనువిప్పు కలిగింది
ప్రపంచంలోనే చాలా కష్టమైన విషయం... కామెడీ చేయడం అంటున్నారు సమంత. అందుకే కమెడియన్లందరికీ సెల్యూట్ అని పేర్కొన్నారామె. సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా, అందర్నీ నవ్వించగలగడం ఓ వరం అని కూడా ఆమె అన్నారు. దీన్నిబట్టి సమంత కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితాన్ని మాత్రం చాలా సీరియస్‌గానే తీసుకుంటారామె. ఏదో నాలుగు సినిమాలు చేశాం... బ్యాంక్ బాలెన్స్ పెంచేసుకుందామనే దృక్పథం కాదు సమంతది. దేవుడు మనకెంతో ఇచ్చినప్పుడు కొంత ఇతరులకు ఇస్తే ఏంటి? అంటారు సమంత. దీని గురించి విపులంగా చెబుతూ -‘‘ఒకప్పుడు నా గురించి తప్ప, నేను ఇతరుల గురించి ఆలోచించేదాన్ని కాదు. నా లుక్స్ ఎంత బాగుండాలి, ఎంత బ్రైట్‌గా కాస్ట్యూమ్స్ వేసుకోవాలి? ఎన్ని సినిమాలు చేయాలి?.. ఇలా నా ధ్యాసంతా వాటి మీదే. కానీ ఆ మధ్య నా ఆరోగ్యం బాగాలేకపోవడంతో నాకు కనువిప్పు కలిగింది. ఆ దేవుడే నాకు పాఠం నేర్పాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు జీవితం చాలా మటుకు అర్థం అయ్యింది. ఒక సినిమా ఎవరినైనా స్టార్‌ని చేయగలదు.. ఆ స్థాయి నుంచి అమాంతం కింద పడేయగలదనే విషయం తెలుసుకున్నాను. సినిమాల ద్వారా వచ్చే పేరు, డబ్బుని ఎంజాయ్ చేస్తూ బాధ్యతలు మర్చిపోయానని జ్ఞానోదయం కలిగింది. అందుకే నా పద్ధతి మార్చుకున్నాను. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయాలని ఫిక్స్ అయ్యాను’’ అన్నారు సమంత. ఇప్పటికే ప్రత్యూష అనే సేవా సంస్థకు తన వంతు సహాయం చేస్తున్నారామె. ఇంకా సేవా కార్యక్రమాలను విస్తరించాలనే ఆలోచన కూడా సమంతకు ఉంది.