ప్రత్యూషకు నేతల అండ
ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన ఎంపీ కవిత
ఉచిత వైద్యం, విద్యతో పాటు ఉద్యోగం కల్పిస్తామని హామీ
రూ. 20 వేలు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్: సవతి తల్లి పైశాచికత్వానికి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష (16) పై శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి నేతలు స్పందించారు. అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం రాత్రి నిజామాబాద్ ఎంపీ కవిత వచ్చి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. చదువుతో పాటు ఉద్యోగం కూడా కల్పిస్తుందని స్పష్టం చేశారు. చిత్రహింసల నుంచి బాలికను కాపాడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావును ఆమె ఈ సందర్భంగా అభినందించారు. అలాగే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు కూడా ఆస్పత్రికి వచ్చి సంఘటన జరిగిన తీరును ప్రత్యూషను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఉచితంగా వైద్య సేవలు అందించిన అవేర్ గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యూషకు చేయవలసిన సహాయ, సహకారాలు త్వరలో అందిస్తామని చెప్పారు. ఎల్‌బీనగర్ వూజీ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యూషను పరామర్శించి ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు, మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి రూ. 5 వేలను ఆస్పత్రి సీఈఓ వేమూరి విజయకుమార్‌కు అందజేశారు. ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఎల్బీ నగర్ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తదితరులు ప్రత్యూషను పరామర్శించారు.