మృతులు సుభద్ర , రాధిక , అక్షయ (ఫైల్ ఫొటోలు)
తల్లి, భార్య, కూతురిని గొంతుకోసి హత్య చేసిన వ్యక్తి
బాలాపూర్‌లో ఘోరం
హైదరాబాద్: ఆస్తిపై పెంచుకున్న మమకారం ముందు రక్త సంబంధం ఓడింది. ఈ క్రమంలోనే ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి తన తల్లి, భార్య, కూతురి గొంతుకోసి ముగ్గురినీ దారుణంగా హత్యచేశాడు. మరో కుమార్తె త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడింది. నగరంలోని పహాడీషరీఫ్ ప్రాంత బాలాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు సంరెడ్డి బల్వంత్‌రెడ్డి, సుభద్ర(65) దంపతుల కుమారులు గోవింద్‌రెడ్డి, రాంరెడ్డి. 2013లో సాయినగర్‌లో నిర్మించిన కొత్త భవనంలోకి వీరంతా మకాం మార్చారు. మొదటి అంతస్తులో రాంరెడ్డి తన భార్య రాధిక (36), కుమార్తెలు ప్రత్యూష (16), అక్షయ (14)లతో నివాసముంటుండగా రెండో అంతస్తులో ఉంటున్న గోవింద్‌రెడ్డి తల్లిదండ్రులనూ తనవద్దే ఉంచుకున్నాడు.
ఇల్లు నచ్చలేదంటూ...
ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే రాంరెడ్డి తనకు ఇల్లు నచ్చడం లేదని, వేరే ఇల్లు కట్టుకుంటానంటూ అందరికీ తరచూ చెప్పేవాడు. వారు అతని ప్రతిపాదనను వ్యతిరేకించేవారు. ఇలా అతని ధోరణిలో మార్పు రాకపోవడంతో పాటు ఆస్తికోసం వేధింపులు పెరగడంతో తండ్రి బల్వంత్‌రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన ఇరువురి కోడళ్ల పేరిట రాశాడు. ఇది వారి మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి. సొంత కుటుంబీకులూ అతని తీరును వ్యతిరేకించ డంతో అందరిపైనా రాంరెడ్డి కక్షపెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారు జామున 3.05 గంటలకు నిద్రపోతున్న భార్య రాధిక గొంతును కత్తితో కోసి చంపాడు. అదే విధంగా నిద్రలో ఉన్న తల్లినీ హత్య చేశాడు. ఆమె పక్కనే పడుకున్న కూతుళ్లు అక్షయ, ప్రత్యూషలు పరిస్థితిని గమనించి పారిపోయేందుకు యత్నించగా అక్షయను వెంబడించి వంటగదిలో అంతమొందించాడు. ప్రత్యూష మాత్రం బాత్‌రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని కేకలు వేసింది. దీంతో అదే ఇంట్లో పై పోర్షన్‌లో ఉన్న గోవింద్ కిందికి రాగానే రాంరెడ్డి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, ఏసీపీ సుదర్శన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా బయటకు వెళ్లిన నిందితుడు సాయిహోమ్స్‌కాలనీలోని ఓ బావిలోకి దూకి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎట్టకేలకు వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో రాంరెడ్డి తనకు కారు కొనివ్వాలంటూ రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది.