ఆయన్ను చట్టపరంగా ఎదుర్కొంటా! | Actress Saritha accuses her estranged husband of bigamy | Sakshi
Sakshi News home page

ఆయన్ను చట్టపరంగా ఎదుర్కొంటా!

Published Mon, Oct 28 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

ఆయన్ను చట్టపరంగా ఎదుర్కొంటా!

ఆయన్ను చట్టపరంగా ఎదుర్కొంటా!

‘‘ఇండియాలో నేను లేని సమయం చూసి, నా భర్త ముఖేష్ మాధవన్ వేరే పెళ్లి చేసుకున్నాడు. నాకు విడాకులు ఇవ్వకుండా వేరే పెళ్లి ఎలా చేసుకుంటాడు? ఈ వార్త విని చాలా షాక్ అయ్యాను’’ అంటూ సీనియర్ నటి సరిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘మరోచరిత్ర’తో కథానాయికగా ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సరిత ఆ తర్వాత పలు అద్భుతమైన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. కొంత విరామం తర్వాత కేరక్టర్ నటిగా మారి, ‘అర్జున్’లాంటి చిత్రాల్లో నటించారామె. ఇదిలా ఉంటే నటుడు ముఖేష్ మాధవన్‌తో ఆమె వివాహం 1988లో జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
 
 గతంలో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు కూడా. అయితే, ఆ తతంగం జరగలేదు. దానికి గల కారణాన్ని, తమ వైవాహిక జీవితంలో జరిగిన సంఘటనలను సరిత చెబుతూ - ‘‘మా పెళ్లయిన తర్వాత ముఖేష్ నన్ను పద్ధతిగా ఉండే మంచి పాత్రలు చేయడానికి కూడా అనుమతించలేదు. ఈ కారణంగానే ఎన్నో మంచి అవకాశాలు కోల్పోయాను. పోనీ, తన వైఖరి బాగుండి ఉంటే ఆనందపడేదాన్ని. నా పట్ల ముఖేష్ అనుచితంగా ప్రవర్తించేవాడు. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులుపెట్టాడు. అతని బాధ్యతారాహిత్యం, మద్యానికి బానిస అయిన వైనం.. ఇవన్నీ మా పిల్లలపై ప్రభావం చూపడం మొదలయ్యింది. 
 
దాంతో అతన్నుంచి విడిపోవాలనుకున్నాను. 2007లో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుకు విన్నవించుకున్నాను. అయితే విడాకులు ఇవ్వడానికి ముఖేష్ నిరాకరించాడు. ఆ తర్వాత అతను కూడా సమ్మతించాడు. దాంతో 2009లో మళ్లీ కేస్ ఫైల్ చేశాం. అయితే ముఖేష్ కోర్టుకి హాజరయ్యేవాడు కాదు. చివరికి కేసుని ఉపసంహరించుకున్నాను. ముఖేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎవరి బతుకులు వారు బతుకుతున్నాం. మా అబ్బాయి శ్రవణ్ ముఖేష్ దుబాయ్‌లో వైద్య విద్య చదువుతున్నాడు.
 
 అందుకని తన దగ్గరకు వెళ్లాను. ఇదే అదను అనుకున్నాడో ఏమో మెతిల్ దేవికాని పెళ్లి చేసుకున్నాడు. చట్టపరంగా నా నుంచి విడిపోకుండా రెండో పెళ్లి చేసుకునే అర్హత తనకు ఎక్కడుంటుంది? ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు. ప్రస్తుతం తన ఇద్దరు బిడ్డలు శ్రవణ్ ముఖేష్, తేజాస్ ముఖేష్ ఆలనా పాలనా కూడా తనే చూసుకుంటున్నానని పేర్కొన్నారు సరిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement