ఆ వెయిట్ పెరగాలంటే.. ఈ వెయిట్ తగ్గాల్సిందే! | Actress should reduce weight to get cinema chances more | Sakshi
Sakshi News home page

ఆ వెయిట్ పెరగాలంటే.. ఈ వెయిట్ తగ్గాల్సిందే!

Published Mon, Jan 5 2015 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Actress should reduce weight to get cinema chances more

 హీరోలకు సిక్స్ ప్యాక్.. హీరోయిన్లకు జీరో సైజ్ ఉండాలనుకునే ట్రెండ్ ఇది. బాలీవుడ్‌లో అయితే ఇది మరింత ఎక్కువ. కానీ, ‘కింగ్ ఆఫ్ రొమాన్స్’ అనిపించుకున్న యశ్ చోప్రా మాత్రం తన చిత్రంలో నటించే నాయికలను ఏనాడూ సన్నబడమని నిబంధన విధించలేదట. యశ్ దర్శకత్వంలో చాలా సినిమాలు చేసిన నటి కాజోల్ స్వయంగా ఈ విషయం చెప్పారు. కానీ, దర్శకులందరికీ యశ్‌జీ అంత ఉదార స్వభావం ఉండదు కదా. ఇండస్ట్రీలో వెయిట్ పెరగాలంటే మీ వెయిట్ తగ్గించుకోవాల్సిందే అని నిర్మొహమాటంగా చెబుతారు. పైగా, ఇప్పటి తరం ప్రేక్షకులు బక్కపలచని భామలనే ఇష్టపడుతున్నారు కాబట్టి, కథానాయికగా రాణించాలనుకునేవాళ్లు బరువు తగ్గక తప్పడంలేదు. అలా గత ఆరేడేళ్లల్లో తెరకు పరిచయమైన నాయికల్లో బక్కపలచగా మారిన బరువందాల తారల గురించి చెప్పుకుందాం.
 
 సోనాక్షీ... మహా మోటు
 ‘దబంగ్’ చిత్రం ద్వారా పరిచయమైన సోనాక్షీ సిన్హాను చూసిన ప్రేక్షకుల గుండె దడదడలాడింది. ఈ భారీ భామ బాలీవుడ్‌లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదని తేల్చేశారు. హీరోయిన్ కాకముందు సోనాక్షీ ఓ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసింది. అప్పుడామె స్టార్ అవుతుందనే నమ్మకం ఎవరికీ ఉండేది కాదట. 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 90 కిలోల బరువుతో చాలా మోటుగా ఉండేది సోనాక్షీ. ‘దబాంగ్’ అంగీకరించిన తర్వాత సోనాక్షీ కష్టాలు మొదలయ్యాయి. వాకింగ్, జాకింగ్‌లతో పాటు ట్రైనర్ చెప్పిన వ్యాయామాలన్నీ చేసి, అందరూ ఆశ్చర్యపోయే రీతిలో తగ్గింది. కానీ, 60 లోపు మాత్రం తగ్గలేకపోయింది. హిందీ రంగంలో ఉన్న ఇతర నాయికలతో పోల్చితే సోనాక్షీ కొంచెం లావుగానే ఉంటుంది. ఇంకొంచెం తగ్గితే బాగుండనుకునేవాళ్లు లేకపోలేదు. కానీ, సోనాక్షీ మాత్రం ఇంకా తగ్గడం తనవల్ల కాదని అంటున్నారు. ఏదేమైనా అవకాశాలకు కొదవ లేదు కాబట్టి, ఈ 60 కిలోల బరువు తనకు పెద్ద భారం కాదనే చెప్పాలి.
 
 సోనమ్... నాట్ సో క్యూట్
 ఇప్పుడేమో సోనమ్ కపూర్‌ని ‘మిస్ స్టయిల్ ఐకాన్’ అంటున్నారు. కానీ, ఒకప్పుడు.. అంటే సినిమాల్లోకి రాకముందు ఆమెను చాలామంది ‘సోనమ్ వెరీ ఫ్యాట్.. నాట్ సో క్యూట్’ అని ఆటపట్టించేవారు. అప్పుడు సోనమ్ బరువు 86 కిలోలు. వెండితెరపైకి రాకముందు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర ‘బ్లాక్’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పని చేసింది సోనమ్. ఆ సమయంలో తన తదుపరి చిత్రం ‘సావరియా’ ద్వారా సోనమ్‌ని కథానాయికగా పరిచయం చేయాలని భన్సాలీ అనుకున్నారు. కానీ, సోనమ్ లడ్డూలా ఉండటంతో.. తగ్గమన్నారు. సోనమ్ కూడా మెరుపు తీగలా మారాలనుకుంది. కానీ, అంత ఈజీయా? అప్పటివరకు పిజ్జాలు, బర్గర్లు తెగ లాగించిన సోనమ్ అవి మానుకోవాల్సి వచ్చింది. అలాగే శరీరానికి కొన్ని క్లిష్టమైన వ్యాయామాలను పరిచయం చేయాల్సి వచ్చింది. భన్సాలీ కూడా ప్రోత్సహించడంతో ఓ సవాల్‌లా తీసుకుని తగ్గింది. ఆ తర్వాత ‘సావరియా’ ద్వారా పరిచయం కావడం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడం తెలిసిందే. ఇప్పుడీ మెరుపు తీగ బరువు జస్ట్ 54.
 
 జరైన్... జర్రంత తగ్గమ్మా
 డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాం అని కొంతమంది తారలంటారు. జరైన్ ఖాన్ ఈ జాబితాకి చెందిన అమ్మాయే. ఓసారి సరదాగా ‘యువరాజ్’ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లినప్పుడు సల్మాన్‌ఖాన్ దృష్టిలో పడ్డారామె. కత్రినా కైఫ్ పోలికలతో ఉన్న జరైన్‌ని చూడగానే సల్మాన్ ఆమెను ప్రోత్సహించాలనుకున్నారు.  ఆ సమయంలో కత్రినాతో మనస్పర్థలు ఏర్పడటంవల్లే ఆయన ఆ విధంగా అనుకున్నారనే వార్త ఉంది. ఏదేమైనా అదృష్టం జరైన్ ఇంటి డోర్‌ని జోరుగా తట్టింది. సల్మాన్‌ఖాన్ సరసన ‘వీర్’లో అవకాశం కొట్టేసింది. కానీ, సినిమా విడుదలయ్యాక.. ‘ప్చ్.. బొద్దుగా ఉంది. సినిమాలకు పనికి రాదు’ అని విశ్లేషకులు తమ కలంతో ఓ రిమార్క్ పడేశారు. దాంతోపాటు దర్శక, నిర్మాతలు, ప్రేక్షకులు కూడా జరైన్ శరీరాకృతిని విమర్శించారు. వాస్తవానికి 100 కిలోల బరువు ఉండే జరైన్ ఆ సినిమా కోసం కొంచెం తగ్గింది. అయినా విమర్శలపాలైంది. జర్రంత తగ్గకపోతే కష్టమే అన్నారు. ఇలా అయితే మనుగడ కష్టమే అనుకున్న జరైన్ తగ్గడం మొదలుపెట్టింది. అప్పటివరకు ముద్దుగా పెంచుకున్న శరీరాన్ని కష్టపెట్టి, ఎట్టకేలకు బరువు తగ్గించేసింది. ఇప్పుడామె వెయిట్ 55 కిలోలు.
 
 పరిణీతి... పరేషాన్
 చబ్బీ చీక్స్, డింపుల్ చిన్... చిన్నప్పుడు ఈ రైమ్‌ని అందరూ పాడుకునే ఉంటాం. విచిత్రం ఏంటంటే.. టీనేజ్‌లో ఉన్న పరిణీతీ చోప్రాని చూసి కుర్రకారు ఈ రైమ్ పాడేవారట. సినిమాల్లోకి రాకముందు పరిణీతి దిగిన కొన్ని ఫొటోలు చూస్తే, వామ్మో అని పరేషాన్ అయినవాళ్లు అంటారు. ఆ రేంజ్‌లో ఉండేది. కథానాయిక కావాలనే కోరిక తనకు లేకపోవడంతో మిస్ ఫ్యాట్ గాళ్‌గానే ఉండిపోవాలని ఫిక్సయ్యిందట. పీఆర్ ఏజెన్సీలో పని చేయడం మొదలుపెట్టాక తన కజిన్ ప్రియాంక చోప్రాలా కథానాయిక కావాలనుకుంది పరిణీతి. దాంతో కొంచెం బరువు తగ్గింది. తొలి చిత్రం ‘లేడీస్ వెర్సస్ రిక్కీ బాల్’తో పెద్దగా మార్కులు సంపాదించకపోయినా, ఆ తర్వాత చిత్రం ‘ఇషక్‌జాదే’లో ‘మే పరేషాన్...’ పాటలో... తన అందచందాలతో కుర్రకారుని పరేషాన్ చేసేసింది. అయితే, పరిణీతి ఇంకా బరువు తగ్గితే బెటర్ అనే ఫీలింగ్‌ని చాలామంది వ్యక్తపరిచారు. ఆ మేరకు కొంచెం సన్నబడింది కానీ, మెరుపు తీగ అనదగ్గ శరీరాకృతికి చేరుకోవాలంటే ఇంకాస్త చిక్కాల్సిందే.
 
 ఆలియా... మిస్ ఫ్యాట్‌యా
 ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న కథానాయికలందరిలోకన్నా ఆలియా భట్ వయసులో చిన్న. ఈ సొట్ట బుగ్గల సుందరి చాలా క్యూట్‌గా ఉంటుంది. కానీ, ఒకప్పుడు అలా ఉండేది కాదు. దాంతో ‘ఆలియా... మిస్ ఫ్యాట్‌యా’ అన్నవాళ్లూ ఉన్నారట. చిన్నప్పుడు ‘సంఘర్ష్’లో నటించినప్పుడు ఆలియా ముద్దుగా ఉండేది. టీనేజ్‌లోకొచ్చాక కథానాయికగా రంగప్రవేశం చేయాలనుకుంది. కానీ, అది జరగాలంటే ముందు సన్నబడాలి.

ఎందుకంటే, దాదాపు 67 కిలోల బరువు ఉండేదట. ఆ బరువుతో తెరపై కనిపిస్తే, ఇంకేమైనా ఉందా? అందుకే వర్కవుట్లు మొదలుపెట్టింది. తండ్రి మహేశ్ భట్ ఆధ్వర్యంలో మూడు నెలలు కఠినమైన వ్యాయామాలు చేయడంతో పాటు, ఆహార పరంగా జాగ్రత్త వహించింది. ఫలితంగా 13 కిలోలు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత ఆలియాను అభిమానులు ‘ఫిఫ్టీ కేజీ తాజ్‌మహల్’ అని ముద్దుగా పిలుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement