బాలీవుడ్‌పై ఆరాటం.. విజయం కోసం పోరాటం | actress tamanna fight for success | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 18 2017 5:24 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

actress tamanna fight for success - Sakshi

దక్షిణాదిలో ప్రముఖ కథానాయికలుగా రాణిస్తున్న చాలామందికి బాలీవుడ్‌లో విజయం సాధించాలన్నది ఒక కలగానే మిగిలిపోతోంది. నటి తమన్నా ఈ కోవలోకే చేరుతుంది. హిమ్మత్‌వాలా, షకలకల్స్‌ వంటి చిత్రాలలో అందాలను ఆరబోసినా ఫలితం దక్కలేదు. దీంతో అందాలతో అక్కడ జయించలేమని అనుభవపూర్వకంగా గ్రహించిందో ఏమో ఈసారి తన బాణీ మార్చుకుంది. యాక్షన్‌ అవతారంతో పోరాడటానికి సిద్ధం అవుతోంది. ఈ అందాల భామకు టాలీవుడ్‌లో మంచి విజయాలు ఉన్నా కోలీవుడ్‌లో తక్కువే. ఇంకా చెప్పాలంటే మాతృభాష హిందీలో తను విజయాల కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. నిజానికి తమన్నా తన నట కేరీర్‌ను బాలీవుడ్‌లోనే ప్రారంభించింది. 2005లో శభా షమీస్‌ అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ మిల్కీ బ్యూటీ పుష్కర కాలంపాటు మాతృభాషలో సరైన హిట్‌ కోసం పోరాడుతూనే ఉంది. టాలీవుడ్‌లో మాత్రం మంచి విజయాలు అందుకుంది. కోలీవుడ్‌లో విక్రమ్‌కు జంటగా నటిస్తున్న స్కెచ్‌ చిత్రం మాత్రమే చేతిలో ఉంది. అయితే తెలుగులో రెండింటిలో, హిందీలో ఒక చిత్రంలో నటిస్తూ బిజీగానే ఉంది. కాగా, ఇప్పటివరకూ గ్లామర్‌తో ఇరగదీస్తూ వస్తున్న తమన్నా బాహుబలి చిత్రంలో తన  అందాలను ఆరబోసినా యాక్షన్‌ సన్నివేశాల్లోనూ చక్కగా నటించి ఆల్‌రౌండర్‌ అనిపించుకుంది. తాజాగా హిందీలో ఈ తరహా నటనను ప్రదర్శించి రాణించాలనుకుంటోంది. ఇప్పటికే కామోష్‌ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న తమన్నా తాజాగా మరో చిత్రానికి సంతకాలు చేసింది. జాన్‌ అబ్రహాంతో రొమాన్స్‌ చేయనున్న ఇందులో ఈ అమ్మడికి పలు యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. మిలాబ్‌ జవేరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. మరి ఈ చిత్రం అయినా తమన్నాకు చెప్పుకోదగ్గ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement