
ఇరవయ్యేళ్ల తర్వాత మళ్లీ బుల్లితెరపై!
విద్యాబాలన్ మన ఇంటికి రానున్నారు. కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పనున్నారు. విచిత్రంగా ఉంది కదూ. విషయం ఏంటంటే... ఇన్నాళ్లూ వెండితెరపై నటిగా తన టాలెంట్ ఏంటో చూపించిన విద్యాబాలన్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనున్నారు. ‘టెడ్’ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించమని కొన్ని నెలల క్రితం ఓ అంతర్జాతీయ చానల్ ప్రతినిధులు విద్యాబాలన్‌ను సంప్రతించారట. ఈ షోలో పలు రంగాలకు సంబంధించిన మేధావులు, ఔత్సాహికులు పాల్గొని కొత్త ఐడియాలను ప్రపంచానికి పరిచయం చేసి, ఆయా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తారు.
సినిమా రంగానికి సంబంధించి విద్యాబాలన్ అయితే బాగుంటుందని సదరు షో నిర్వాహకులు భావించారట. విద్యా బాలన్‌కి కూడా ఈ షో కాన్సెప్ట్ నచ్చి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ‘‘ఆ షో నిర్వాహకులు రెండు ఐడియాలతో నా దగ్గరకు వచ్చారు. ఒకటి నచ్చింది. వెంటనే దీన్ని డెవలప్ చేసి తీసుకురమ్మన్నా. ఫైనల్ కాన్సెప్ట్ నచ్చితే ఓకే చెప్పేస్తా’’ అని విద్యాబాలన్ అన్నారు. విశేషమేమిటంటే, ఆమె మొదట ఓ బుల్లితెర కార్యక్రమం ‘హమ్‌పాంచ్’తో పరిచయమై ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడు గుపెట్టారు.