![After MeToo Allegations Rajkumar Hirani Decided To Go Solo - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/15/rajkumar-hirani.jpeg.webp?itok=1NbFjPSa)
తనుశ్రీ దత్తా ప్రారంభించిన ‘మీటూ’ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా, జర్నలిజం వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖుల మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో దేశం అట్టుడికి పోయింది. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కూడా ఉన్నారు. ‘సంజు’ సినిమా సమయంలో రాజ్‌కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఏడాది అనీల్ కపూర్ - సోనమ్ కపూర్లు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా థో హైసా’ లగా చిత్రం నుంచి కూడా రాజ్‌కుమార్ పేరును తొలగించారు.
ఇన్నాళ్లు వినోద్ చోప్రోతో కలిసి తన ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన రాజ్‌కుమార్ హిరాణీ తొలిసారి ఒంటరిగా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ‘ప్రస్తుతానికి స్క్రిప్ట్ రెడీ అయ్యింది. ఈ సారి రాజ్‌కుమార్ ఒక్కరే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులతో సినిమా గురించి మాట్లాడారు. వారంతా ఈ చిత్రంలో పని చేసేందుకు రెడీగా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన వెలువడనుంద’ని రాజ్‌కుమార్ సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు.
గతంలో రాజ్‌కుమార్ సంజు, పీకే సినిమాలకు వినోద్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌కుమార్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment