అవకాశం కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో...
‘‘రికార్డులు బ్రేక్ చేయాలనే లక్ష్యంతో నేను సినిమాలు ఎంపిక చేసుకోను. కథ నన్ను కదిలించాలి. నా హృదయాన్ని హత్తుకోవాలి. అలాంటి కథలకు పచ్చజెండా ఊపేస్తా’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. ‘త్రీ ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమిర్ నటించిన ‘పీకె’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, చిత్రకథానాయిక అనుష్క శర్మ, రాజ్‌కుమార్ హిరాని, నిర్మాతలు విధు వినోద్ చోప్రా, అభిజిత్ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమిర్ ఈ విధంగా సమాధానాలిచ్చారు.
‘పీకె’ అంటే ఏంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?
సినిమా విడుదల వరకు దాని గురించి చెప్పకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. నేను నవ్వకుండా ఎదుటి వ్యక్తిని నవ్వించాలి. అదెంత కష్టమో ఊహించుకోండి.
పీకె మీ పాత్ర పేరా?
నిజం చెప్పనా?... ఈ సినిమాలో నా పేరేంటో నాకే తెలియదు. అందరూ నన్ను పీకె... పీకె అని పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారో కూడా తెలియదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
ఈ చిత్రం ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ. సందేశం, వినోదం రెంటికీ ప్రాధాన్యం ఇస్తారు. ఆయన గొప్ప రచయిత, దర్శకుడు. ఈ చిత్రానికి ఆయనే హీరో అంటే అతిశయోక్తి కాదు.
ఈ సినిమాలో మీరు భోజ్‌పురి భాష మాట్లాడారట.. ఆ భాష మీకు వచ్చా?
రాదు. ఈ సినిమా కోసం ఓ మూడు, నాలుగు నెలలు నేర్చుకున్నాను. భోజ్‌పురి అందరికీ అర్థం అయ్యే అవకాశం లేదు కాబట్టి.. సింపుల్ భాషలోనే సంభాషణలు ఉంటాయి.
ఈ చిత్రం పోస్టర్లో రేడియో అడ్డం పెట్టుకుని.. అర్ధనగ్నంగా కనిపించడంపై కొన్ని విమర్శలు ఎదురయ్యాయి కదా?
సినిమా చూస్తే ఆ సీన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏంటో తెలుస్తుంది. కథకు అవసరం లేకుండా ఏదీ చేయలేదు.
‘ఓ మై గాడ్’ చిత్రానికీ, దీనికీ దగ్గర పోలికలున్నాయనే వార్త ప్రచారంలో ఉంది?
అది నిజం కాదు. కానీ, ఈ చిత్రంలో మతపరంగా, మూఢనమ్మకాలపై సెటైర్లు ఉన్నాయి. అయితే అవి ఎవర్నీ కించపరిచే విధంగా ఉండవు.
ఈ చిత్ర నాయిక అనుష్క శర్మ కన్నా మీరు పొట్టిగా కనిపిస్తున్నారు కదా!
అవునా.. అలా అనిపిస్తోందా? (...అంటూ అనుష్క శర్మను నిలబడమని, తన పక్కనే నిలబడ్డారు ఆమిర్). చూడండి.. నేనే హైట్‌గా ఉన్నాను కదా!
కానీ, ఈ చిత్రం పోస్టర్లో మీరు పొట్టిగా కనిపిస్తున్నారు.. పొట్టివాడు గట్టివాడు అనే మాటతో ఏకీభవిస్తారా?
అస్సలు ఏకీభవించను. ఎవరి సత్తా వారిది. మీకు పోస్టర్లో నేను పొట్టిగా కనిపిస్తే.. అది నా తప్పు కాదు (నవ్వుతూ). నేను మాత్రం అనుష్కకన్నా హైటే.
నచ్చిన వ్యక్తులపై ప్రేమ వ్యక్తపరచడానికి పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకోవచ్చనే కాన్సెప్ట్ కొచ్చిలో మొదలైంది. ‘కిస్ ఆఫ్
లవ్’ పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం?
అది హద్దులు దాటనంత వరకూ ఓకే. కానీ, హద్దులు దాటితే అసహ్యంగా ఉంటుంది. మా అమ్మ, నా భార్య కిరణ్, పిల్లలపై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడానికి నేను వెనకాడను. ఇతరులు కూడా వాళ్లకి నచ్చినవాళ్లపై ఆ విధంగా వ్యక్తపరిస్తే.. నేను కామెంట్ చేయను. ఎవరిష్టం వాళ్లది. మనది స్వతంత్ర భారత దేశం. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ఉండొచ్చు. కానీ, అది ఇతరులను ఇబ్బందిపెట్టకుండా చూసుకోవాలి.
ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి, ఇతర సమస్యల గురించి ఇప్పటికే ‘సత్యమేవ జయతే’లో చాలా విషయాలు చెప్పారు... ఈ సినిమాలో ఆ అంశం గురించిన ప్రస్తావన ఉందా?
ఈ సినిమా కథకూ, ఆ అంశానికీ సంబంధం లేదు. కానీ, మన చట్టం గురించి ఒక్కటి చెబుతాను. నిర్భయ కేసు జరుగుతున్న సమయంలో ఒక న్యాయవాది అమెరికా వెళ్లారు. అక్కడ కూడా నిర్భయ సంఘటన జరిగింది. నిర్భయ కేసుతో పాటు అమెరికాలో జరిగిన సంఘటన గురించి అక్కడి లాయర్లతో ఆమె చర్చించారు. అప్పుడు జరిగిన ఓ విషయాన్ని ఆమె నాతో పంచుకున్నారు. అదేంటంటే... ‘ఈ రెండు ఘోరాలూ ఒకేసారి జరిగాయి. కానీ, ఇక్కడ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. అక్కడి వ్యక్తికి మాత్రం 120 ఏళ్ల జైలు శిక్ష పడింది’ అని ఆమె అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ వ్యక్తి అన్నేళ్లు బతుకుతాడా లేదా అనేది తర్వాతి సంగతి. అతను చేసిన పనికి అన్నేళ్ల శిక్ష అవసరం అని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. మన చట్టం పనితీరు ఎలా ఉందో? దీన్నిబట్టి ఊహించుకోవచ్చు.
తెలుగులో సినిమా చేయమంటే చేస్తారా?
ఎందుకు చెయ్యను? బలమైన కథ ఉంటే కచ్చితంగా చేస్తాను. ఆ మధ్య ఓ సందర్భంలో నేను, రాజమౌళి కలుసుకున్న విషయం తెలిసిందే. సినిమా చేయాలనే ఆలోచనతో కలవలేదు. కానీ, రాజమౌళి మంచి విషయం ఉన్న దర్శకుడు. తనతో అవకాశం వస్తే, తప్పకుండా చేస్తాను.