
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు వివాహ బంధంతో ఒక్కటవడంతో సెలబ్రిటీలు, ప్రముఖులంతా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విరుష్కకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
నూతన దంపతుల వెడ్డింగ్ ఫోటోను పోస్ట్ చేసి సరికొత్త జీవన ప్రయాణం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.అయితే ఇన్‌స్టాగ్రామర్లు దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్ట్ చేశారు. గతంలో సన్నిహితంగా మెలిగిన సల్మాన్, కత్రినాలు ఒక్కటి కావాలని ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు.మరి మీ పెళ్లెప్పుడు అంటూ కొందరు, సల్మాన్‌ను పెళ్లి చేసుకుంటారని ఆశిస్తున్నామంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. సల్మాన్, కత్రినా మాత్రం తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని గాసిప్స్‌ను తోసిపుచ్చుతూ పలుమార్లు స్పష్టం చేశారు.
వీరిద్దరూ దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వలో టైగర్ జిందా హైలో స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు. డిసెంబర్ 22న ఈ మూవీ విడుదల కానుంది.