మళ్లీ షూటింగ్‌లో బిజీ... | again balakrishna busy in shootings | Sakshi
Sakshi News home page

మళ్లీ షూటింగ్‌లో బిజీ...

Published Sat, Aug 23 2014 12:31 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

మళ్లీ షూటింగ్‌లో బిజీ... - Sakshi

మళ్లీ షూటింగ్‌లో బిజీ...

షూటింగుల్లో హీరోలకు అప్పుడప్పుడు ప్రమాదాలు వాటిల్లడం సహజం. కానీ... బాలకృష్ణకు మాత్రం అప్పుడప్పుడు కాకుండా తరచూ జరుగుతాయి. ‘భార్యాభర్తల బంధం’(1985) సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణ సమయంలో... 30 అడుగులపై నుంచి సాహసోపేతంగా డూప్ లేకుండా దూకి, కాలు ఫ్రాక్చర్ చేసుకున్నారు.

ఇది 30 ఏళ్ల క్రితం ముచ్చట. అప్పట్నుంచీ తరచూ ఆయన్ను ప్రమాదాలు పలకరిస్తూనే ఉన్నాయి. అయినా ఆయన తన సాహస ధోరణి మానలేదు. ఇప్పుడు బాలకృష్ణ ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్నారు. ఈ వయసులో కూడా ఆయన ప్రమాదాలకు వెరవరు. ఎంతటి రిస్కీ షాట్ అయినా సాధ్యమైనంతవరకూ డూప్ లేకుండా చేయడానికే ఇష్టపడతారు.
 
అంత కష్టపడతారు కాబట్టే, తరగని అభిమాన ధనం ఆయన సొంతమైంది. తాజాగా సత్యదేవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌లో బాలయ్య స్వల్ప ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్‌పై బైక్ రైడింగ్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఆయన ప్రమాదానికి గురయ్యారు. కాలికి గాయమై రెండు వారాలైనా గడవక ముందే మళ్లీ బాలకృష్ణషూటింగ్‌లో పాల్గొనడం విశేషం.
 
గురువారం నుంచి ఆర్‌ఎఫ్‌సీలో బాలకృష్ణ, త్రిష, ఎమ్మెస్ నారాయణ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సత్యదేవ్. బాలకృష్ణ, త్రిష కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో జతకట్టిన త్రిష, ఇప్పుడు బాలయ్యతో కూడా జోడీ కట్టడంతో అగ్రహీరోలైన నలుగురితో నటించిన నేటితరం నాయికల్లో ఒకరయ్యారు. తాజా షెడ్యూల్ సెప్టెంబర్ దాకా నిర్విరామంగా హైదరాబాద్ పరిసరాల్లో జరుగనుంది. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement