టెక్నాలజీ సాయంతో ఉపవాసం విరమణ
Published Thu, Oct 24 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
టెక్నాలజీ పుణ్యమా అని మనుషుల మధ్య దూరం తగ్గిపోతోంది. వేల, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎంచక్కా అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌తో ముచ్చట్లు చెప్పేసుకోవచ్చు. ఇక, అంతర్జాలం సౌకర్యం అయితే మనుషుల్ని మరింత దగ్గర చేసేస్తుంది. ‘స్కైప్’ సౌకర్యం ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్ మాట్లాడేసుకోవచ్చు. అందాల తార ఐశ్వర్యరాయ్ ఇటీవల ఈ స్కైప్ సౌకర్యాన్ని వాడుకుని, ఉపవాసాన్ని విరమించారు.
విషయంలోకొస్తే... ఉత్తరాదివారు ప్రతి ఏడాదీ ‘కర్వా చౌత్’ అనే పండగ జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్త యోగ క్షేమాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం భర్త ముఖారవిందాన్ని వీక్షించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. పెళ్లయినప్పట్నుంచీ తన భర్త అభిషేక్‌బచ్చన్ కోసం ఐష్ ఈ ఆచారం పాటిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఐష్ ఈ ఉపవాస దీక్ష చేపట్టాలనుకున్నారు. అయితే అభిషేక్‌బచ్చన్ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లారు.
కానీ, లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుని, హాయిగా పండగ చేసుకున్నారు ఐష్. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భార్యకు, సాయంత్రం ‘స్కైప్’ ద్వారా దర్శనమిచ్చారు అభిషేక్. భర్తను ఫోన్లో చూసుకున్న తర్వాత, ఉపవాసాన్ని విరమించారు ఐష్. దీని గురించి అమితాబ్ బచ్చన్... ట్విట్టర్‌లో ‘‘భర్త ఊళ్లో లేకపోయినా ఐష్ కర్వా చౌత్ చేసుకుంది. స్కైప్ ద్వారా అభిని చూసింది. అంతా టెక్నాలజీ మహిమ’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పెళ్లయిన తర్వాత కర్వా చౌత్ సమయంలో అభిషేక్ ఊళ్లో లేకపోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా అభిషేక్... ‘‘స్కైప్‌కి థ్యాంక్స్. దాని ద్వారా ఐష్‌కి దర్శనమివ్వగలిగాను’’ అని ట్విట్టర్‌లో సంబరపడి పోయారు.
Advertisement