Karva Chauth
-
టీమిండియా కెప్టెన్ ఇంట కర్వా చౌత్ వేడుకలు (ఫొటోలు)
-
‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి.. -
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్‌సమంద్, చిత్తోడ్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ప్రతాప్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
భార్య ఉపవాసం.. భర్త ఆత్మహత్య
లక్నో: నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వా చౌత్ పండుగ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. భర్త క్షేమం కోరుతూ.. భార్యలు రోజంతా ఉపవాసం చేసి.. చంద్రుడిని చూసిన తర్వాత భర్త చేతుల మీదుగా ఉపావాస దీక్ష విరమిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు మీరట్‌లో ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భర్త క్షేమం కోసం మహిళ ఉపవాసం చేస్తుండగా.. అతడు మాత్రం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. వివరాలు.. మీరట్ నాయి బస్తికి చెందిన వినోద్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన వినోద్ కుమార్ కర్వా చౌత్ పర్వదినం నాడు ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి విజయ్ గుప్తా మాట్లాడుతూ.. ‘దంపతులిద్దరు తరచుగా గొడవపడుతుండేవారు. దాంతో వినోద్ కుమార్ అప్సెట్ అయ్యాడు. చివరకు ప్రాణం తీసుకున్నాడు’ అని తెలిపారు. ( కర్వా చౌత్; శిల్పా శెట్టిపై భర్త ఫన్నీ కామెంట్) భర్త వేధింపులు తాళలేక.. యూపీలోనే మరో ఘటనలో ఓ వివాహిత భర్త వేధింపులు తట్టుకోలేక కర్వా చౌత్ పర్వదినం నాడు ప్రాణాలు తీసుకుంది. 29 ఏళ్ల కంచన్ భర్త వేధింపులు తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె ఈ దారుణానికి ఒడి గట్టిందని కంచన్ తండ్రి తెలిపారు. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
కర్వా చౌత్ రోజే ఖతం చేశాడు!
గుర్గావ్ : వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కట్టుకున్న భార్యను కర్వా చౌత్ రోజే ఖతం చేశాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్ ఫరిదాబాద్ రోడ్ సమీపంలోని అన్సాల్ వ్యాలీలో గత శనివారం చోటుచేసుకుంది. దీపావళికి ముందు వచ్చే చవితి నాడు నార్త్‌కి చెందిన మహిళలు కర్వా చౌత్‌ను జరుపుకుంటురాన్న విషయం తెలిసిందే. ఆ రోజు మహిళలు తమ భర్త కోసం ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళ పూజ నిర్వహించి ఆ తర్వాత జల్లెడలో చంద్రుడితో పాటు భర్త ముఖాన్ని చూసి, ఉపవాసం విడిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. కానీ నిందితుడు తనకోసం ఉపవాసం ఉన్న తన భార్యను కర్వాచౌత్ అడ్డంగా పెట్టుకోని 8వ అంతస్తు నుంచి తోసేశాడు. ఈ ఘటన వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. (చదవండి: పూజారులు వెలివేశారు.. భార్య వదిలేసింది) విక్రమ్ చౌహన్ అనే ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి తన సతీమణి దీపికను 8వ అంతస్తు నుంచి నెట్టేసి చంపాడు. మృతురాలి తండ్రి అహుజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచి రెండురోజులు కస్టడీలోకి తీసుకున్నారు. దీపిక తండ్రి అహుజా మీడియాతో మాట్లాడుతూ.. విక్రమ్ చౌహన్, దీపికలు 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారని, వారికి నాలుగేళ్ల కూతురు, ఆరునెలల బాలుడున్నారని తెలిపారు. వారి నివాసం పక్కనే నివసించే ఓ మహిళతో విక్రమ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనీ, సదరు మహిళ తరుచూ వారి ఫ్లాట్‌కు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఈ విషయంపై తన కూతురు నిలదీయడంతో దారుణంగా కొట్టి, కర్వా చౌత్ సాకుగా బాల్కనీ నుంచి తోసేశాడని కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. (చదవండి: పురుషులే టార్గెట్) -
కర్వా చౌత్ : మిస్ యూ శ్రీదేవి
ముంబై: సాంప్రదాయబద్దంగా జరుపుకునే కర్వా చౌత్ రోజున (ఇక్కడ అట్ల తద్ది) కపూర్ కుటుంబం దివంగత అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఈ పర్వ దినం సందర్బంగా ఎప్పటిలాగానే ఆతిధ్య మిచ్చిన సునీతా కపూర్ (అనిల్ కపూర్‌భార్య) సోషల్‌మీడియాలో షేర్ చేశారు. శనివారం కర్వా చౌత్ పూజలకు హాజరైన ఇతర స్నేహితుల ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఐ మిస్ యూ శ్రీ అంటూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తోపాటు నీలం కోఠారి, కైకిషాన్ పటేల్, నటుడు వరుణ్ ధావన్ తల్లి లాలి ధావన్, నిర్మాత రేణు రవి చోప్రా ఇతరుల హాజరైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే గతంలో శ్రీదేవితో కలిసి కర్వా చౌత్ సంబరాన్ని నెమరు వేసుకుంటూ అప్పటి ఫోటోను కూడా పోస్ట్ చశారు. దీంతో ఈ పోస్ట్‌కు చాలామంది స్పందించారు. శ్రీదేవికి కర్వా చౌత్ అంటే చాలా ఇష్టమనీ, ఈ ఉత్సవాలకు ఎదురు చూసేవారంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు శిల్పాశెట్టి ఒకప్పటి వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితులో బాత్ టబ్‌లో పడి (ఈ ఏడాది ఫిబ్రవరి 24న) చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
పండుగనాడు భర్త ఫోన్ ఎత్తలేదని..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగనాడు తన ఎన్నారై భర్త ఫోన్ ఎత్తలేదని మనోవేదనతో ఓ భార్య ప్రాణత్యాగం చేసుకొంది. ఇంట్లో ఉరి పెట్టుకొని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 37 ఏళ్ల మహిళకు ఓ ఎన్నారైకు మూడేళ్ల కిందట వివాహం అయింది. అతడు 15 రోజుల కిందటే అమెరికా వెళ్లిపోయాడు. అయితే, కార్వా చౌత్ పండుగ (నిండు పౌర్ణమినాడు భర్త ముఖాన్ని జల్లెడలో నుంచి చూడటం)నాడు ఆమె తన భర్తకు ఫోన్ చేసింది. అయితే, అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పైగా ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో కూడా ఉంది. దీంతో పలుమార్లు ఫోన్ చేసిన ఆమె భర్త ఫోన్ ఎత్తలేదని కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదో రకం శిక్ష
సాక్షి, లక్నో : నిబంధనలు మన మంచికేనన్నది తెలిసి కూడా వాటిని ఉల్లంఘించటం కొందరికి అలవాటుగా మారింది. గతేడాది దేశవ్యాప్తంగా నమోదయిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే నమోదయి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 55 శాతం హెల్మెట్ ధరించకపోవటంతో జరిగినవే. ఈ నేపథ్యంలో ఆదివారం అక్కడి పోలీస్ శాఖ ఓ పని చేసింది. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి ఫైన్ వేయకుండా వారి భార్యలను అక్కడికి పిలిపించింది. ఆపై మహిళల చేతుల మీదుగా వారి భర్తలకు హెల్మెట్లు తొడిగించింది. కర్వా చౌత్ పండగ సందర్భంగా పోలీసులు ఈ పని చేయించారు. ఇందుకోసం తమ సొంత నిధులనే ఖర్చు చేశారు పోలీసులు. ‘భర్తలు బాగుండాలని కోరుకుంటూ పెళ్లయిన ఆడవాళ్లంతా తప్పనిసరిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. అందుకే వారి చేతుల మీదుగా ప్రాణాల విలువ తెలియజేసేలా ఈ పని చేయించాం. వాహనదారులకు మేం చేసే సూచన ఒక్కటే దయచేసి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపకండి’ అని ఎస్పీ దీపక్ కుమార్ తెలిపారు. -
చందమామ రావె జాబిల్లి రావె!
ఎరుపు రంగు చీరలో అప్పుడే పూసిన ఎర్ర గులాబీలా శ్రీదేవి, గులాబీ రంగు డ్రెస్సులో అందమైన గులాబీ పువ్వులా బిపాసా బసు, హాఫ్ వైట్ శారీ, రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజులో మాన్యతా దత్, రెడ్ కలర్ చుడీదార్లో రవీనా టాండన్.. ఇలా అందరూ మెరిసిపోయారు. ‘కర్వా చౌత్’ పండగ కోసమే వీళ్లంతా ఇలా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ అంటే ఏంటో కొంతమందికి తెలిసే ఉంటుంది. భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చందమామను చూసి, ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉత్తరాదిన చాలా ఘనంగా చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ కర్వా చౌత్ ఆచరించే తన బంధువులు, స్నేహితుల కోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లూ చేశారు. షబానా ఆజ్మి, ఆమె భర్త జావేద్ అఖ్తర్, శ్రీదేవి, బోనీకపూర్, రవీనా టాండన్ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ దత్ భార్య మాన్యతా దత్ తన ఇంట్లోనే కర్వా చౌత్‌ని ఆచరించారు. గతేడాది కరణ్ సింగ్ గ్రోవర్ని పెళ్లి చేసుకున్న బిపాసా బసు తొలి కర్వా చౌత్‌ను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం చందమామ కనిపించగానే ఉపవాసాన్ని విరమించి, ‘ఇప్పుడు ఫుడ్ దొరుకుతుంది’ అంటూ భార్యాభర్తలిద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేశారు. మొత్తానికి చిన్నప్పుడు ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తే.. పెళ్లయ్యాక భర్త క్షేమం కోసం పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ‘చందమామ రావె జాబిల్లి రావె’ అంటూ చంద్రుణ్ణి ఆహ్వానించడం ఓ మంచి అనుభూతి. -
పండగపూట భార్య కళ్లెదుటే భర్త కాల్చివేత
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యలు తమ భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటూ చేసే కడ్వా చౌత్ వ్రతం రోజునే.. భార్య కళ్లెదుటే భర్తను కాల్చిచంపారు. ఆశారామ్ (42) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యాడు. కడ్వా చౌత్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఆయన భార్య.. ఆశారామ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారు. పసుపుపచ్చ రంగు షర్టు వేసుకొచ్చిన పాతికేళ్ల యువకుడు తన భర్తను కాల్చిచంపాడని ఆమె తెలిపారు. అతడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఆశారాంకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అయితే గత దీపావళి రోజున జరిగిన కాల్పుల కేసులో మాత్రం ఇతడు కీలక సాక్షి అని బంధువులు చెప్పారు. కానీ ఆ కోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏవీ లేవని, అందువల్ల పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. ఆశారామ్ బీజేపీ కార్యకర్త అని, స్థానిక బీజేపీ ఎంపీతో సన్నిహితంగా వ్యవహరిస్తుంటారని కొందరు చెబుతున్నారు. -
పండగ చేసుకున్నారు!
చందమామ రావె జాబిల్లి రావె... అంటూ ఆకాశాన్ని చూపిస్తూ అమ్మ తినిపించిన గోరుముద్దలు అందరికీ గుర్తుండే ఉంటాయి. పెద్దయిన తర్వాత కూడా ఈ చందమామ కోసం ఆడవాళ్లు ఎదురు చూసే రోజు ఒకటుంది. అదే ‘కర్వా చౌత్’. భర్త ఆయురారోగ్యాల కోసం భార్యలు చేసుకునే పండగ ఇది. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ఆ చల్లని చందమామను చూసి, ఆ తర్వాతే ఆహారం తీసుకుంటారు. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో శ్రీదేవి, ఐశ్వర్యా రాయ్, శిల్పా శెట్టి.. ఇలా పలువురు ప్రముఖ తారలు కర్వా చౌత్‌ని చాలా నిష్టగా చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. సాయంత్రం జల్లెడలోంచి చందమామను, ఆ తర్వాత భర్త ముఖారవిందాన్ని చూసి, ఉపవాసాన్ని విరమిస్తారు. శ్రీదేవి అయితే పసుపు పచ్చ చీరకు, పచ్చ రంగు బోర్డరు, మ్యాచింగ్ ఆభరణాలతో పండగ రోజు మెరిసిపోయారు. ‘‘భర్త కోసం ఉపవాసం ఉండటంలో ఓ ఆనందం ఉంది. నేను చాలా శ్రద్ధగా చేస్తాను. దాదాపు పెళ్లి కూతురిలా సింగారించుకోవడం నా అలవాటు’’ అని శ్రీదేవి అన్నారు. శిల్పా శెట్టి అయితే, స్వయంగా తానే ఓ చీరను డిజైన్ చేసుకున్నారు. ఆ చీరకు తగ్గ నగలతో చాలా నిండుగా కనిపించారు శిల్పా. అమితాబ్ బచ్చన్ భార్య, నటి జయబాధురి, ఐశ్వర్యా రాయ్ కూడా ఎప్పటిలానే ఘనంగా పండగ చేసుకున్నారు. ఈ అత్తా, కోడళ్లు ఇంటిని దీపాలతో అలంకరించారు. ఇంకా సోనాలి బింద్రే, ఇషా డియోల్, అహనా డియోల్.. ఇలా పలువురు తారలు కర్వా చౌత్ జరుపుకున్నారు. -
టెక్నాలజీ సాయంతో ఉపవాసం విరమణ
టెక్నాలజీ పుణ్యమా అని మనుషుల మధ్య దూరం తగ్గిపోతోంది. వేల, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎంచక్కా అరచేతిలో ఇమిడిపోయే సెల్‌ఫోన్‌తో ముచ్చట్లు చెప్పేసుకోవచ్చు. ఇక, అంతర్జాలం సౌకర్యం అయితే మనుషుల్ని మరింత దగ్గర చేసేస్తుంది. ‘స్కైప్’ సౌకర్యం ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ ఫోన్ మాట్లాడేసుకోవచ్చు. అందాల తార ఐశ్వర్యరాయ్ ఇటీవల ఈ స్కైప్ సౌకర్యాన్ని వాడుకుని, ఉపవాసాన్ని విరమించారు. విషయంలోకొస్తే... ఉత్తరాదివారు ప్రతి ఏడాదీ ‘కర్వా చౌత్’ అనే పండగ జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా పెళ్లయిన ఆడవాళ్లు తమ భర్త యోగ క్షేమాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం భర్త ముఖారవిందాన్ని వీక్షించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. పెళ్లయినప్పట్నుంచీ తన భర్త అభిషేక్‌బచ్చన్ కోసం ఐష్ ఈ ఆచారం పాటిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఐష్ ఈ ఉపవాస దీక్ష చేపట్టాలనుకున్నారు. అయితే అభిషేక్‌బచ్చన్ షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లారు. కానీ, లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుని, హాయిగా పండగ చేసుకున్నారు ఐష్. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భార్యకు, సాయంత్రం ‘స్కైప్’ ద్వారా దర్శనమిచ్చారు అభిషేక్. భర్తను ఫోన్లో చూసుకున్న తర్వాత, ఉపవాసాన్ని విరమించారు ఐష్. దీని గురించి అమితాబ్ బచ్చన్... ట్విట్టర్లో ‘‘భర్త ఊళ్లో లేకపోయినా ఐష్ కర్వా చౌత్ చేసుకుంది. స్కైప్ ద్వారా అభిని చూసింది. అంతా టెక్నాలజీ మహిమ’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పెళ్లయిన తర్వాత కర్వా చౌత్ సమయంలో అభిషేక్ ఊళ్లో లేకపోవడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా అభిషేక్... ‘‘స్కైప్‌కి థ్యాంక్స్. దాని ద్వారా ఐష్‌కి దర్శనమివ్వగలిగాను’’ అని ట్విట్టర్లో సంబరపడి పోయారు. -
ఆన్లైన్లో కడ్వా చౌత్ జరుపుకొన్న అభిషేక్, ఐశ్వర్య!
ఏదైనా పని ఒప్పుకొన్నప్పుడు.. ఆ పని పూర్తి చేయాల్సిందే. బాలీవుడ్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ విషయాన్ని నూటికి నూరుపాళ్లు నమ్ముతారు. సినిమాల్లో చాలాసార్లు ఐశ్వర్యారాయ్ కడ్వా చౌత్ వ్రతాన్ని పద్ధతిగా చేసింది. కానీ నిజజీవితంలో మాత్రం ఈసారి అలా చేసుకోడానికి వీలు కుదరలేదు. ఎందుకంటే, షూటింగ్ పనిమీద అభిషేక్ బచ్చన్ ఎక్కడో బ్యాంకాక్‌లో ఉన్నాడు. కానీ అంతమాత్రాన పద్ధతులు మానుకోలేం కదా అంటూ ఐశ్వర్యారాయ్ ఆన్లైన్ పద్ధతిని ఆశ్రయించింది. My 1st Karwa Chawth away from the Mrs. Thank god for Facetime! — Abhishek Bachchan (@juniorbachchan) October 23, 2013 ఉచిత వీడియో కాలింగ్ అందజేసే 'ఫేస్ టైమ్'ను ఆమె ఆశ్రయించింది. షూటింగ్ కోసం బ్యాంకాక్‌లో ఉన్న అభిషేక్ బచ్చన్‌ను ఫేస్ టైమ్ ద్వారా పలకరించి, వ్రతాన్ని పూర్తిచేసింది. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో తెలిపాడు. తొలిసారి తన భార్య దగ్గర లేకుండా కడ్వా చౌత్ వ్రతం జరిగిందని, ఫేస్ టైమ్ పుణ్యమాని అది పూర్తయిందని అన్నాడు. 2007లో పెళ్లయిన వీరికి రెండేళ్ల ఆరాధ్య అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే.