పండగ చేసుకున్నారు!
చందమామ రావె జాబిల్లి రావె... అంటూ ఆకాశాన్ని చూపిస్తూ అమ్మ తినిపించిన గోరుముద్దలు అందరికీ గుర్తుండే ఉంటాయి. పెద్దయిన తర్వాత కూడా ఈ చందమామ కోసం ఆడవాళ్లు ఎదురు చూసే రోజు ఒకటుంది. అదే ‘కర్వా చౌత్’. భర్త ఆయురారోగ్యాల కోసం భార్యలు చేసుకునే పండగ ఇది. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం ఆ చల్లని చందమామను చూసి, ఆ తర్వాతే ఆహారం తీసుకుంటారు. ప్రతి ఏడాదీ ముంబయ్‌లో శ్రీదేవి, ఐశ్వర్యా రాయ్, శిల్పా శెట్టి.. ఇలా పలువురు ప్రముఖ తారలు కర్వా చౌత్‌ని చాలా నిష్టగా చేస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ సంప్రదాయాన్ని పాటించారు. సాయంత్రం జల్లెడలోంచి చందమామను, ఆ తర్వాత భర్త ముఖారవిందాన్ని చూసి, ఉపవాసాన్ని విరమిస్తారు.
శ్రీదేవి అయితే పసుపు పచ్చ చీరకు, పచ్చ రంగు బోర్డరు, మ్యాచింగ్ ఆభరణాలతో పండగ రోజు మెరిసిపోయారు. ‘‘భర్త కోసం ఉపవాసం ఉండటంలో ఓ ఆనందం ఉంది. నేను చాలా శ్రద్ధగా చేస్తాను. దాదాపు పెళ్లి కూతురిలా సింగారించుకోవడం నా అలవాటు’’ అని శ్రీదేవి అన్నారు. శిల్పా శెట్టి అయితే, స్వయంగా తానే ఓ చీరను డిజైన్ చేసుకున్నారు. ఆ చీరకు తగ్గ నగలతో చాలా నిండుగా కనిపించారు శిల్పా. అమితాబ్ బచ్చన్ భార్య, నటి జయబాధురి, ఐశ్వర్యా రాయ్ కూడా ఎప్పటిలానే ఘనంగా పండగ చేసుకున్నారు. ఈ అత్తా, కోడళ్లు ఇంటిని దీపాలతో అలంకరించారు. ఇంకా సోనాలి బింద్రే, ఇషా డియోల్, అహనా డియోల్.. ఇలా పలువురు తారలు కర్వా చౌత్ జరుపుకున్నారు.