విడ్డూరం కదూ! ఒక దారం తీసుకుని మూడు ముళ్లు వేస్తే ఒక పవిత్రమైన పెళ్లి. బాలీవుడ్ హీరోయిన్‌లయితే సినిమాల్లో చెవులు పగిలేంత వరకు ‘పతీ పరమేశ్వర్ హై’ అనే డైలాగులు కొడుతూనే ఉంటారు. హీరోలైతే గర్ల్‌ఫ్రెండ్ కోసం, పెళ్లాం కోసం ఓ ఐదొందల మందిని, ఓ డజను సుమోల్నీ గాల్లో లేపేస్తూ ఉంటారు. కానీ విడ్డూరమే! రియల్ లైఫ్‌లో హీరోయిన్‌లు ఒకసారి మూడు ముడులు వేసిన వాళ్లతో ఇంకో మూడు ముళ్లు వేయించుకోవడం విడ్డూరమే! మూడు ప్లస్ మూడు.. ఆరు ముళ్లు అవలేదా?! ఇదంతా ‘ఆరు’భాటం కోసం, అరకొర పబ్లిసిటీ కోసం అని కొందరు గేలి చేసినా, ఈ బాలీవుడ్ పెళ్లిళ్లు మాత్రం మూడు పూలు, ఆరు ముళ్లుగా వర్ధిల్లుతూనే ఉన్నాయి. విడ్డూరమే!!
మనూళ్లో అయితే ఇది జబ్బు. ‘ఇదేం జబ్బు!’ అనేస్తారు. జబ్బే కాదు. పిచ్చి. చాదస్తం. తెలియనితనం. అమాయకత్వం. కాదా మరి! పెళ్లైనోడిని పెళ్లాడ్డం ఏమిటి?! ఎంత లేకపోయినా మనింటి పిల్లను రెండో పెళ్లివాడికి కట్టబెడతామా! అంతుండి.. మరేమిటి ఈ హీరోయిన్‌లు ఆల్రెడీ పెళ్లయిన హీరోనో, పెళ్లయిన బిజినెస్‌మేన్‌నో, పెళ్లయిన కవినో, పెళ్లయిన క్రికెటర్‌నో చేసుకుంటారు! అంత కర్మేమిటì ?! పీక్‌లో ఉన్నప్పుడు వీళ్ల పిచ్చి పీక్స్‌లోకి వెళ్లిపోతుంది ఎందుకు? మంచి టైమ్‌లో.. ఇండస్ట్రీలో వెలిగిపోతున్నప్పుడు, వచ్చిపడుతున్న డబ్బును డీల్ చెయ్యడానికి ఇద్దరు ముగ్గురు మేనేజర్లు చెమటలు కక్కుతున్నప్పుడు, అభిమానులు గుండెల్లో గుడి కట్టుకుంటున్నప్పుడు.. షెడ్యూళ్ల కోసం నిర్మాతలు ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు.. మన కలలరాణులు పల్లకీని ఎక్కివెళ్లి సెకండ్‌హ్యాండ్ టీవీ సెట్టును ఇంటికి కొని తెచ్చేసుకుంటారు ఎందుకు? ఏం చూద్దామని? ఏం చేద్దామని! మన అభిమాన తార సినిమాలు మానేస్తోందంటే కాలచక్రం ఆగిపోతుంది. మన ఆరాధ్య దేవత పెళ్లి చేసేస్కుంటోందంటే కాలకృత్యాలూ క్రమం తప్పుతాయి. మన స్వప్నసామ్రాజ్ఞి పెళ్లయినవాడిని, పెళ్లై పిల్లలున్నవాడిని, విడాకులిచ్చేసి వీధులు తిరుగుతున్నవాడిని చేసుకుంటోందంటే.. వాడిని రెండు పీకి, ఆమెను నెత్తిపైన పెట్టుకుని మన ఊళ్లోకి, మన ఇంట్లోకి తెచ్చేసుకోవాలనిపిస్తుంది. ‘రాణిలా చూసుకుంటాం. ఆ దౌర్భాగ్యం నీకెందుకు మేడమ్’ అని ఊళ్లోని ప్రతి యూత్‌లో ఒక హీరో నిద్ర లేస్తాడు.
అయినా అయ్యేపనేనా? మనం నిద్రలేవడం, మనలోని హీరో నిద్ర లేవడం! అది ముంబై. ఇది వెంకటాపురం. అది దివి. ఇది భువి. హీరోయిన్ పెళ్లివార్తను పత్రికలో చూడ్డమే గానీ, పెళ్లిపత్రికేమైనా మనింటికి వచ్చేదా! ప్రతి అభిమానీ ఓ ఉదయం బాధపడే ఉంటాడు. సావిత్రి.. జెమినీ గణేశన్‌ను చేసుకుందని తెలిసినప్పుడు ఇంటి ముందు మిన్ను విరిగి పడే ఉంటుంది. శ్రీదేవి బోనీకపూర్‌ను చేసుకుందని తెలిసినప్పుడు కొత్తపట్నం సముద్రంలో అలలు ఆగిపోయే ఉంటాయి. హేమమాలిని ధర్మేంద్రను చేసుకుందని తెలిసినప్పుడు ఊహల జగత్తు తుత్తునియలు అయ్యే ఉంటుంది. వీళ్లేనా? కరీనా, కరిష్మా, విద్యాబాలన్, లారాదత్తా, శిల్పాశెట్టి, జూహీచావ్లా, రవీనా టాండన్, షబారా అజ్మీ, సంగీతా బిజ్లానీ.. ఏం కర్మ.. వీళ్లందరికీ! కర్మ కాదు. ప్రేమ!!
ప్రేమ.. వెలిగిస్తుంది. ఆర్పేస్తుంది. హృదయాన్ని వెలిగించి ఆలోచనను ఆర్పేస్తుంది. మన హీరోయిన్ మీద మనకున్న ప్రేమ కొద్దీ, కోపం కొద్దీ, కసి కొద్దీ ఇలా అనుకుంటాం కానీ ఏం కాదు. ‘సెకండ్ హ్యాండ్’ను అందుకున్నంత మాత్రాన బాక్సులకు బదులుగా బతుకు బద్దలైపోయిన ఒకట్రెండు ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. ప్రేమతో వెలుగుతున్న జంటలే ఎక్కువ. ఒకసారి వీళ్లను చూడండి.
కరీనా- సైఫ్
కరీనా పంజాబీ. హిందువుల అమ్మాయి. సైఫ్. తెలిసిందే. ముస్లిం. ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ కూడా తక్కువేం కాదు. గ్యాప్ సంగతి అలా ఉంచండి. అతడికో భార్య ఉంది. అమృతాసింగ్. సైఫ్‌కన్నా పన్నెండేళ్లు చిన్న. ఇద్దరూ విడిపోయారు. భరణంగా అమృతకు ఐదు కోట్లిచ్చాడు సైఫ్. అదొక్కటే కాదు. కొడుక్కి 18 ఏళ్లు వయసు వచ్చేవరకు అతడు నెలకు లక్ష రూపాయలు పంపించాలి. ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా.. కరీనా, సైఫ్‌ల ప్రేమకు ఇవేం అడ్డుకాలేదు. ‘తషాన్’ షూటింగ్‌లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆరేళ్లు ప్రేమలో ఉన్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీళ్లకిప్పుడు ‘తైమూర్’ అనే బేబీ బాయ్. హ్యాపీగా ఉన్నారు. కరీనా పెళ్లితో గుండె ముక్కలు చేసుకున్న ఆమె ఫ్యాన్స్ కూడా ఆ విలయం నుంచి క్రమంగా కోలుకున్నారు.
కరిష్మా-సంజయ్
కపూర్స్ కుటుంబంలోనే ఇంకో అమ్మాయి కరిష్మా. కరీనాకు అక్క. విడాకులు తీసుకున్న బిజినెస్‌మేన్ సంజయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. ఇంట్లో డబ్బులివ్వడం లేదని కరిష్మా కంప్లైంట్. పిల్లలిద్దర్నీ.. సమైరా, కియాన్.. కోర్టు కరిష్మాకు ఇచ్చేసింది. సంజయ్ పూర్వీకుల ఇంటిని కరిష్మకు రాసివ్వమంది. పిల్లలిద్దరి పేరు మీద 14 కోట్ల బాండ్స్‌ని కొనివ్వాలన్న ఒప్పందం కుదిరింది. బాండ్‌లపై నెలకు కరిష్మకు పది లక్షలు వస్తుంది. ఈ మధ్యే 2017లో సంజయ్ తన గర్ల్‌ఫ్రెండ్ ప్రియా సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్నాడని, కరిష్మా కూడా ఇంకో బిజినెస్‌మేన్ సందీప్ తోష్ణీవాల్‌తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తోష్ణీవాల్ తన మొదటి భార్యకు విడాకులిచ్చేసి కరిష్మాను పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాట్ట!
విద్యాబాలన్- సిద్ధార్థ్ రాయ్
పెళ్లయినవాణ్ణి కాదు, పెళ్లిళ్లు అయినవాణ్ణి పెళ్లి చేసుకున్నారు విద్యాబాలన్. రాయ్‌కి బాలన్‌తో ఇది మూడో పెళ్లి! రాయ్ మొదటి భార్య ఆరతి బజాజ్. చిన్ననాటి స్నేహితురాలు. రెండో భార్య టీవీ ప్రొడ్యూసర్ కవిత. ఆమెనూ ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. అదీ నిలవలేదు. ఇప్పుడు విద్యాబాలన్‌తో సంతోషంగా ఉన్నాడు. మరి విద్య అతడితో సంతోషంగా ఉన్నారా? ఉండే ఉంటారు. ప్రేమించే కదా విద్య అతడిని పెళ్లి చేసుకున్నారు! మగాళ్లు ప్రేమిస్తే చెప్పలేం కానీ, ఆడవాళ్లు ప్రేమిస్తే అది స్థిరంగా ఉండిపోతుంది.
లారాదత్తా- మహేశ్ భూపతి
లారా మాజీ మిస్ యూనివర్స్. మహేశ్ భూపతి టెన్నిస్ ప్లేయర్. అనుకోకుండా ఒకర్నొకరు కలుసుకున్నారు. అప్పటికే భూపతి ఒక భార్యకు భర్త. అప్పటికే లారా ఒక ప్రియుడికి ప్రియురాలు. కొంతకాలం తర్వాత మళ్లీ లారా, భూపతి ఒక బిజినెస్ మీట్‌లో కలుసుకున్నారు. ‘ఐయామ్ ఇన్ లవ్ విత్ యు సిన్స్..’ అంటూ ఆమెను తను ఎప్పట్నుంచీ ప్రేమిస్తున్నాడో చెప్పాడు. అతడి సాఫ్ట్‌నెస్ ఆమెలో స్ట్రాంగ్ ఫీలింగ్స్ కలిగించింది. భార్య శ్వేతా జైశంకర్‌కి భాపతి విడాకులిచ్చాక, అతడిని పెళ్లి చేసుకున్నారు లారా.
శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా
ఇదొక విఫల ప్రేమ వివాహం. ఇందులో రెండు వేర్వేరు చాప్టర్లు ఉన్నాయి. శిల్ప మొదట అక్షయ్‌కుమార్‌ని లవ్ చేశారు. ‘ఇన్సాఫ్’తో వాళ్ల ప్రేమ చిగురించింది. ‘ధడ్కన్’తో వడలిపోయింది. రీజన్ ఏంటంటే.. పెళ్లయ్యాక నువ్వు సినిమాల్లో నటించకూడదు మరి అని అక్షయ్ కండిషన్ పెట్టాడు! అంతే.. వద్దనుకుంది శిల్ప. వద్దనుకుంది సినిమాలను కాదు అక్షయ్‌ని. తర్వాత రాజ్ కుంద్రా అనే బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకుంది శిల్ప. ఈ వ్యవహారం రాజ్ భార్య కవితకు నచ్చలేదు. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ‘మళ్లీ రానక్కర్లేదు’ అని కవితకు మెసేజ్ పెట్టాడు రాజ్ కుంద్రా.
జూహీ చావ్లా -జయ్ మెహ్‌తా
మెహ్‌తా ఇండస్ట్రియలిస్టు. రాకేశ్ రోషన్ ‘కరోబార్’ తీస్తుంటే మెహ్‌తా సెట్‌లోకి వచ్చాడు. అప్పుడే జూహీ ఆయన్ని చూశారు. లవ్‌లో పడ్డారు. మెహ్‌తాకు అప్పటికే పెళ్లయింది. ఆయన భార్య సుజాతా బిర్లా. ఇక వీళ్లిద్దరి మధ్యా రహస్యంగా ప్రేమ కొనసాగింది. సుజాత విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆమె ప్లేస్‌లోకి జూహీ వెళ్లిపోయారు.
రవీనా టాండన్-అనిల్ థడానీ
‘స్టంప్డ్’ మూవీ రిలీజ్ ఫంక్షన్‌లో తొలిసారి కలుసుకున్నారు రవీనా, అనిల్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో అప్పటికే థడానీకి పెద్ద పేరు. అప్పటికే అతను మ్యారీడ్. నిర్మాత రోమూ సిప్పీ కూతురు నటాషా సిప్పీ అతడి భార్య. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నాక రవీనా అనిల్‌ని చేసుకున్నారు.
శ్రీదేవి- బోనీ కపూర్
శ్రీదేవికి బోనీతో, బోనీ కపూర్ భార్య మోనాతో పరిచయం. అయితే బోనీ వల్ల శ్రీదేవి గర్భవతి అవడంతో జీవితాలు మలుపు తిరిగాయి. బోనీ ఇంట్లోనే మోనాతో, బోనీతో కలిసి ఉండిపోయారు శ్రీదేవి. బోనీ కాపురం కూల్చేసిందని కూడా శ్రీదేవి నింద పడ్డారు. ఇద్దరు పిల్లలు.. అర్జున్, అన్షులు పుట్టాక బోనీ మోనాకు దూరం అయ్యాడు. శ్రీదేవి బోనీకి దగ్గరయ్యారు.
షబానా అజ్మీ-జావేద్ అఖ్తర్
జావేద్ అఖ్తర్ కవి. షబానా అజ్మీ తండ్రి కైఫీ అజ్మీ కవి. అఖ్తర్ తన కవిత్వంపై అభిప్రాయం కోసం కైఫీ ఇంటికి వచ్చేవారు. అప్పుడే మొదటిసారి షబానాను చూశాడు. అప్పటికే అఖ్తర్‌కి పెళ్లయి, పిల్లలు. అఖ్తర్‌కీ, అజ్మీకి మధ్య ప్రేమ జనించడానికి అవేవీ అడ్డు కాలేదు. మొదటి భార్య హనీ ఇరానీతో గొడవలొచ్చి, విడాకులిచ్చేశాక అఖ్తర్‌ని పెళ్లాడారు అజ్మీ.
మహిమా చౌదరి-బాబీ ముఖర్జీ
‘పర్‌దేశ్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన మహిమా చౌదరిని ఆరాధించిన ప్రముఖుల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఆమె బాబీ ముఖర్జీని వలచారు. బాబీ కోల్‌కతాలో ఆర్కిటెక్ట్. ఒక సందర్భంలో వారు కలుసుకున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. అప్పటికే అపర్ణ గాంధీతో అతడికి పెళ్లయింది. ఆమెకు అతడు విడాకులిచ్చాక మహిమ బాబీని చేసుకున్నారు.
ఈ పది మంది బాలీవుడ్ హీరోయిన్‌లే కాదు. రాణీముఖర్జీ (ఆదిత్యా చోప్రా).. సంగీతా బిజ్లానీ (అజరుద్దీన్).. ఇంకా మరికొందరు రెండో భార్యస్థానంలోకి వెళ్లారు. వాళ్లందరి చేతా ఏడడుగుల వేయించింది ప్రేమే!
Comments
Please login to add a commentAdd a comment