పండగపూట భార్య కళ్లెదుటే భర్త కాల్చివేత
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యలు తమ భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటూ చేసే కడ్వా చౌత్ వ్రతం రోజునే.. భార్య కళ్లెదుటే భర్తను కాల్చిచంపారు. ఆశారామ్ (42) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యాడు. కడ్వా చౌత్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఆయన భార్య.. ఆశారామ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారు. పసుపుపచ్చ రంగు షర్టు వేసుకొచ్చిన పాతికేళ్ల యువకుడు తన భర్తను కాల్చిచంపాడని ఆమె తెలిపారు. అతడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు.
ఆశారాంకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అయితే గత దీపావళి రోజున జరిగిన కాల్పుల కేసులో మాత్రం ఇతడు కీలక సాక్షి అని బంధువులు చెప్పారు. కానీ ఆ కోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏవీ లేవని, అందువల్ల పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. ఆశారామ్ బీజేపీ కార్యకర్త అని, స్థానిక బీజేపీ ఎంపీతో సన్నిహితంగా వ్యవహరిస్తుంటారని కొందరు చెబుతున్నారు.