సల్మాన్ వివాదంపై ఐశ్వర్యరాయ్ కామెంట్స్
న్యూఢిల్లీ: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు మాజీ ప్రేయసి, స్టార్ హీరోయిన్ ఐశ్యర్యరాయ్ బచ్చన్ మద్ధతు తెలిపింది. రియో ఒలింపిక్స్ కు భారత్ నుంచి గుడ్ విల్ అంబాసిడర్‌గా సల్మాన్ ఎంపికవ్వడం చాలా మంది పెద్దలకు రుచించలేదు. గత శనివారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు(రాజకీయ రంగం, క్రీడారంగం) సల్మాన్ పై విమర్శలు, తమ కోపాలను కామెంట్స్ రూపంలో వెల్లగక్కుతున్నారు. మొదట అంబాసిడర్ పదవిని షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లకు ఇవ్వాలని వారి పేర్లను పరిశీలించిన అధికారులు, ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సల్మాన్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించేశారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సల్మాన్ ఎంపికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐఓఏ నిర్ణయాన్ని మనం గౌరవించాలని అంతేకానీ అపహాస్యం చేయకూడదంటూ అందాల సుందరి ఐశ్యర్యరాయ్ అభిప్రాయపడింది. దేశం తరఫున వెళ్తున్న ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడం, వారిని ఉత్తేజపరిచే సామర్థ్యమున్న వ్యక్తులు ఎవరినైనా ఈ పదవి వరించే అవకాశం ఉంది. గుడ్ విల్ అంబాసిడర్ అయ్యే వ్యక్తి ఏ రంగానికి చెందినవారైనా తమ బాధ్యతను నిర్వర్తిస్తాడన్న నమ్మకంతో వారికి ఆ పదవికి ఎంపిక చేయవచ్చు అంటూ కండలవీరుడికి తన మద్ధతు ప్రకటించింది. సల్మాన్ ప్రస్తుతం రెజ్లర్ నేపథ్యంలో సాగే 'సుల్తాన్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.