మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది! | Aishwarya's daughter Aaradhya hugged Ranbir Kapoor from behind thinking it was her father | Sakshi
Sakshi News home page

మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది!

Published Fri, Oct 21 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది!

మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది!

‘ఏ దిల్ హై ముష్కిల్’... అంటే ఈ మనసు చాలా క్లిష్టమైనది అని అర్థం. ఇప్పుడీ చిత్ర దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. భారత్-పాక్ మధ్య ఏర్పడిన తాజా సమస్యల కారణంగా పాకిస్తాన్ నటీనటులు నటించిన చిత్రాలను విడుదల చేయకూడదనీ, అసలు వాళ్లను ఎంకరేజ్ చేయకూడదనీ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘ఏ దిల్ హై ముష్కిల్’లో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేయడం ఈ చిత్రానికి తలనొప్పిగా మారింది. సినిమా విడుదలైతే థియేటర్లు బద్దలు కొడతామని ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ పేర్కొంది. దాంతో 28న ఈ చిత్రం విడులవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు చూసి, కోడలుపిల్ల అలా నటించినందుకు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త ప్రచారమైంది. ‘టూ మచ్’గా ఉన్న సీన్స్‌ని తీసేయాలని కరణ్ జోహార్‌ని అమితాబ్ కోరారని మరో వార్త వచ్చింది. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ఈ సీన్స్ గురించి ఐశ్వర్యా రాయ్ ఏమంటున్నారో చూద్దాం. ‘‘ఇందులో నా పాత్ర పేరు సబా తలియర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ పాత్ర పేరు అయాన్. సబాయే అయాన్ జీవితం. ఆమె కవితలను అతను పాడతాడు. సబా ప్రభావం అతని మీద ఎంత ఉంటుందంటే.. అతని జీవితంలో ఓ భాగమైపోతుంది. విడిపోవడంలో కూడా ఓ కొనసాగింపు ఉంటుంది. అంత గాఢమైన బంధం వాళ్లది. ఆ బంధం తాలూకు ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది. అందుకే సబా, అయాన్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌లో ఆ గాఢత కనిపించాలని కరణ్ జోహార్ అన్నారు. రొమాన్స్ డోస్ ఇంకా ఉండాలన్నారు. కానీ, నా కంఫర్ట్ స్పేస్ దాటి నేనేదీ చేయలేదు’’ అని ఐష్ స్పష్టం చేశారు.

 ఇంకా ‘ఏ దిల్ హై ముష్కిల్’ గురించి ఆమె మాట్లాడుతూ - ‘‘సినిమా చూసి, బయటికొచ్చేవాళ్లు ‘ఎంత అందమైన కెమిస్ట్రీ’ అనుకోకుండా ఉండలేరు. సినిమాలో ఉన్న ప్రేమ గురించి, పాటల గురించి, విజువల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నేను సబాలాంటి పాత్రను ఇంతవరకూ చేయలేదు. ఆ మాటకొస్తే... రీల్‌పై సబా ఎదుర్కొన్న అనుభవాలు రియల్ లైఫ్‌లో నేను ఎదుర్కోలేదు. ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయడం నటిగా నా ధర్మం. ‘జజ్బా’లో దల్బీర్ కౌర్‌గా సాదాసీదా లుక్‌లో కనిపించాను. ఈ సినిమాలో అందంగా కనిపించాలి, కనిపించాను. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా కనిపిస్తాను.

ఆ విషయంలో నాకెలాంటి అభద్రతాభావం లేదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఐష్-అభిషేక్ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్ ఓసారి రణ్‌బీర్ కపూర్‌ని చూసి, తన తండ్రి అనుకుందట. ఈ విషయం గురించి ఐష్ మాట్లాడుతూ - ‘‘ఒక రోజు అభిషేక్ లాంటి టోపీ, జాకెట్ వేసుకున్నాడు రణ్‌బీర్. అతన్ని వెనక నుంచి చూసిన ఆరాధ్య తన డాడీ అనుకుంది. వెనకాల నుంచి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత కంగారు పడింది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement