నటుడు అజిత్ రాజకీయాలకు ఆసక్తి చూపుతున్నారా? ఈయన్ని రాజకీయాల్లోకి దింపాలని పలు ప్రముఖ రాజకీయ పార్టీలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. ఇటీవల ఒక రాజకీయ పార్టీ ఈయనకు గాలం వేసే ప్రయత్నం చేసినా, తనను రాజకీయాల్లోకి లాగొద్దు అని స్పష్టం చేశారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా రాజకీయాలపై ఆసక్తి అని అంటారేమిటనేగా మీ ప్రశ్న. నిజమే అజిత్ నిజ జీవితంలోనే కాదు, సినిమాల్లోనూ ఇప్పటి వరకూ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించలేదు.
నటుడు విజయ్ కత్తి, మెర్శల్, సర్కార్ లాంటి రాజకీయ అంశాలతో కూడిన చిత్రాల్లో నటించి విజయాలతో పాటు, విమర్శలు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన తాజాగా రాజకీయాలకు దూరంగా జాలీగా సాగే చిత్రం చేస్తుంటే, ఆయన సహ నటుడైన అజిత్ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రంలో నటించడానికి సై అన్నట్లు తాజా సమాచారం.
అజిత్ విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఇప్పుడు నర్కొండ పార్వవై అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్ అన్నది గమనార్హం. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనికపూర్ నిర్మిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హిందీ చిత్రం పింక్‌ను చిన్న చేర్పులు, మార్పులు చేసి తమిళంలో రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ఈ చిత్రం తరువాత నిర్మాత బోనికపూర్ సంస్థలోనే అజిత్ మరో చిత్రం చేయనున్నారు. ఇది ఈజిప్ట్ చిత్రం హెప్టా లాస్ట్ లెక్చర్ అనే చిత్రానికి రీమేక్ అని సమాచారం. హెప్టా లాస్ట్ లెక్చర్ చిత్రాన్ని చూసిన అజిత్ దాని రీమేక్‌లో నటించడానికి ఆసక్తి చూపినట్లు తెలిసింది. దాని రీమేక్ హక్కులను బోనీకపూర్ పొందారట. దీనికి శివ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
కాగా ఈ చిత్రం తరువాత అజిత్ విశ్వాసం చిత్ర నిర్మాత సత్యజ్యోతి ఫిలింస్ సంస్థకు మరో చిత్రాన్ని చేయనున్నట్లు తాజా సమాచారం. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందట. దీనికి నర్కొండ పార్వై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న హెచ్.వినోద్‌నే దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే. ఆ విధంగా అజిత్ సినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment