
మరో హీరోకి లీకేజ్ ప్రాబ్లమ్
ప్రస్తుతం ఇండస్ట్రీని వేదిస్తున్న సమస్యల్లో పైరసీ అన్నింటికంటే పెద్దది. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ వర్గాలను ఇబ్బంది పెడుతూ వస్తున్న ఈ పైరసీ భూతం మారుతున్న టెక్నాలజీ కారణంగా రిలీజ్కు ముందే చిత్ర యూనిట్కు షాక్ ఇస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చాలా చిత్రాలు విడుదలకు ముందే ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా అజిత్ హీరోగా తెరకెక్కిన 'వేదలం' సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది.
గతంలో పవన్కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' రిలీజ్కు ముందే దాదాపు సగం సినిమా నెట్లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో నిర్మాతకు ఎలాంటి నష్టం రాలేదు. తరువాత 'బాహుబలి', 'పులి' లాంటి భారీ చిత్రాలకు కూడా ఇదే సమస్య ఎదురైంది. అయితే టెక్నాలజీ పరంగా గ్రాఫిక్స్, రీ రికార్డింగ్, డిఐ లాంటి సాంకేతికతల కోసం చాలా మంది చేతులు మారుతున్న సినిమాలు, ఎక్కడో ఒకచోట పైరసీ బారిన పడుతున్నాయి.
అదే బాటలో అజిత్ హీరోగా నటిస్తున్న వేదలం సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు శుక్రవారం నెట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన చిత్ర నిర్మాత ఎఎం రత్నం సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఆ సీన్స్ను తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.